Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కస్తూరిబా బడి బాలికలకు బాల్యవివాహాలు
- కరోనాతో అర్ధాంతరంగా ఆగిన చదువులు
- 14 స్కూళ్లలో 72 మంది పాఠశాలలకు స్వస్తి
- సంసారం ఈదలేక పేదింటి బిడ్డల బాధలు
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
పట్టుమని పదహారేళ్లూ నిండని ఆ పేదింటి బిడ్డలకు పెళ్లి కష్టాలు వచ్చాయి. పుస్తక ప్రాయంలో పుస్తెల తాళ్లు గుండెలపై భారంగా మారాయి. కరోనా ధాటితో ఛిన్నాభిన్నమైన పలు పేద కుటుంబాలు బిడ్డల చదువు మాన్పించి పెళ్లి పీటలు ఎక్కించారు. ఖమ్మం జిల్లాలో 14 కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలుండగా కోవిడ్ సమయంలో 72 మంది చదువుకు స్వస్తి పలికారు. వీరిలో అత్యధికులకు పెళ్లిళ్లు చేశారు. ఇందులో కొందరు చిరుప్రాయంలో సంసార సాగరం ఈదలేక అనారోగ్యబారిన పడుతున్నారు. కాపురాల్లో కలతలు, మభ్యపెట్టి పెళ్లి చేసుకున్న అత్తారింటి వేధింపులతో కొందరి పెళ్లిళ్లు ఏడాది తిరగకముందే పెటాకులవుతున్నాయి. అనారోగ్య కారణాలు, ఆర్థిక ఇబ్బందుల నడుమ ఆడపిల్లలకు త్వరగా పెళ్లి చేసి భారం దింపుకోవాలనే యోచనతో కరోనా కష్టకాలంలో అప్పుచేసి మరీ కళ్యాణం జరిపించిన తల్లిదండ్రులు కొందరు ఇప్పుడు తీరని వ్యథ అనుభవిస్తున్నారు.
నవతెలంగాణ-ఖమ్మంప్రాంతీయప్రతినిధి
కూసుమంచి మండలం గైగోళ్లపల్లికి చెందిన ఓ నిరుపేద గిరిజన కుటుంబం పదినెలల క్రితం కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో తన కూతురికి పెళ్లి చేసింది. ముదిగొండ మండలం లక్ష్మీపురం కస్తూర్బా బాలికల విద్యాలయంలో నాడు 9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థినిని అర్థాంతరంగా తల్లిదండ్రులు చదువుమాన్పించారు. రూ.8లక్షలు వెచ్చించి పట్టుమని 15 ఏళ్లూ నిండని తమ కూతురుకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రానికి చెందిన యువకునితో వివాహం జరిపించారు. కట్నం కింద రూ.2.50 లక్షలు, కానుకల కింద రూ.1.50 లక్షలతో ఇంట్లోకి సామగ్రి కొనిచ్చారు. మొత్తంగా రూ.4లక్షల వరకు ముట్టజెప్పారు. కానీ ఆ యువకునికి మూర్ఛ వ్యాధి ఉండటంతో తరచూ ఫిట్స్ వచ్చి కిందపడిపోతున్నాడు. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న పెద్దకూతురికి ఇచ్చి పెళ్లి చేద్దామని సంబంధం ఖాయం చేసుకుంటే ఆమె నిరాకరించడంతో చిన్నకూతుర్ని బలవంతాన ఒప్పించి మరీ పెళ్లి చేశారు. రెక్కలుముక్కలు చేసుకుని కూడబెట్టిన రూ.4లక్షలకు తోడు మరో రూ.4 లక్షలు అప్పుచేసి పెళ్లి చేస్తే అల్లుడు అనారోగ్యంతో అవస్థపడుతుండటంతో విడాకులకు సిద్ధమయ్యారు. మరోవైపు బాల్యవివాహ చట్టం కింద కేసు నమోదవడంతో కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. కోవిడ్ సమయంలో స్వగ్రామంలో పనులు లేక ముదిగొండ గ్రానైట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి వచ్చిన ఆ బాలిక తల్లిదండ్రులు 'పెళ్లి చేసి తప్పు చేశాం' అని పశ్చాతాప పడుతున్నారు. కూతురిని మళ్లీ యథావిధిగా కస్తూర్బా విద్యాలయంలో చేర్పించారు. ఇప్పుడు ఆ బాలిక పదో తరగతి చదువుతోంది.
- ఇది ఈ ఒక్క కుటుంబం బాధ కాదు
దాదాపు 72 మంది పిల్లల వ్యథ. 2020-21లో కామేపల్లి కస్తూర్బా స్కూల్లో ఇంటర్ ఫస్టియర్‌లో జాయిన్ అయిన టేకులపల్లి మండలానికి చెందిన మరో బాలికకు కూడా ఇలాగే వివాహం చేశారు. బాల్య వివాహం కావడంతో కాపురం చేయడానికి ఆ బాలిక అవస్థలు పడుతోంది. తరచూ గర్భకోశ సమస్యలు తలెత్తుతున్నాయి. తిరుమలాయపాలెం మండలం దమ్మాయిగూడెంకు చెందిన మరో బాలిక కూడా ఇలాగే అనారోగ్యసమస్యలు ఎదుర్కొంటోంది. ఆర్థికలేమి, అవగాహన రాహిత్యం కారణంగానే ఇలా బాల్యవివాహాలు జరుగుతున్నట్లు కస్తూర్బా విద్యాలయాల నిర్వాహకులు చెబుతున్నారు.
- కోవిడ్ సమయంలోనే చదువుకు స్వస్తి...
దారిద్య్రరేఖ దిగువన ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ కుటుంబాలకు చెందిన బాలికలకు విద్యా సౌకర్యాల కల్పనలో భాగంగా 2004లో దేశవ్యాప్తంగా కస్తూర్బాబాలికల విద్యాలయాలను నెలకొల్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న లింగ అసమానతలు రూపుమాపడానికి నెలకొల్పిన ఈ విద్యాలయాలు కరోనా కారణంగా రెండేళ్ల పాటు మూసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ బోధన చెప్పించే ఆర్థిక స్తోమతలేని అనేక మంది తల్లిదండ్రులు పిల్లలను చదువుమానిపించారు. ఖమ్మం జిల్లాలో 14 కేజీబీవీలు ఉండగా బోనకల్ 6, చింతకాని 4, ఏన్కూరు 6, కామేపల్లి 4, ఖమ్మం అర్బన్ 7, కొత్తూరు (వై) 8, కొణిజర్ల 9, కూసుమంచి 3, ముదిగొండ 6, పెనుబల్లి 6, రఘునాథపాలెం 1, తిరుమలాయపాలెం 4, ఎర్రుపాలెం 8 మొత్తంగా 72 మంది కోవిడ్ సమయంలో చదువు మానేశారు. వీరిలో అత్యధికులకు పెళ్లిళ్లు చేశారు. కొందరు కుటుంబానికి తోడుగా కూలి పనులకు వెళ్తున్నారు. పెళ్లిళ్లు చేసుకున్న అనేక మంది అనారోగ్యంతో అవస్థపడుతున్నారు.
- కోవిడ్ సమయంలోనే అధిక పెళ్లిళ్లు
సంధ్యారాణి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారి
కరోనా సమయంలో జిల్లాలోని అనేక మంది కేజీబీవీ బాలికలకు పెళ్లిళ్లు జరిగినట్లు గుర్తించాం. కోవిడ్ సమయంలో అధికారులు ఇళ్లకు వెళ్లి పర్యవేక్షణ చేయలేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఆన్లైన్ క్లాస్‌లు చెప్పించే స్తోమత లేకపోవడం తదితర కారణాలతో పెళ్లిళ్లు చేశారు. వీరిలో కొందర్ని గుర్తించి కేసులు కూడా నమోదు చేశాం. చిన్నవయస్సులో పెళ్లిళ్లు చేస్తే తలెత్తే పర్యవసానాలపై ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ ద్వారా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కస్తూర్బా స్కూల్స్‌లోనూ బాల్యవివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచిస్తున్నాం. కూసుమంచి, తిరుమలాయపాలెంలో ఇటీవల సదస్సులు నిర్వహించాం. అన్ని కేజీబీవీల్లోనూ ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేస్తాం. గిరిజన తండాల్లోనూ అవగాహన సదస్సులు కొనసాగిస్తున్నాం.
- కోవిడ్ సమయంలోనే బడి మాన్పించారు..
యాదయ్య, ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి
కరోనా సమయంలోనే కేజీబీవీ విద్యార్థినులకు అత్యధికంగా పెళ్లిళ్లైనట్లు మా నోటీసుకూ వచ్చింది. బాల్యవివాహాల వల్ల జరిగే నష్టాలను వివరిస్తున్నాం. ఆయా స్కూల్స్‌లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం. కానీ కొందరు తల్లిదండ్రులు పేదరికం తదితర కారణాలతో చిన్నవయస్సులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. చట్టరీత్యా ఇది నేరం.