Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- యథేచ్ఛగా 1/70 చట్టానికి తూట్లు
- చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
- బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
చుంచుపల్లి మండల పరిధిలోని చుంచుపల్లి తండా పంచాయతీలో గతంలో ప్రభుత్వం పేదల కోసం కేటాయించిన ఇనాం భూములను ఇటీవల కొంత మంది భూ అక్రమార్కులు ఆక్రమించి వెంచరు వేసి అమ్మకాలు చేస్తున్నారని బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు యెర్రా కామేష్ ఆరోపించారు. శనివారం చుంచుపల్లి తండా పంచాయతీలోని సర్వే.నెం.16/4లో అక్రమంగా ఆక్రమించిన ఇనాం భూములలో వెలసిన వెంచరును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రానికి చుట్టుపక్కల 1/70 చట్టానికి తూట్లు పొడుస్తూ విచ్చలవిడిగా వెంచర్లు వేస్తున్నారని ఆరోపించారు. చుంచుపల్లి తండా పంచాయతీ పరిధిలో ఏజెన్సీ, పంచాయతీ చట్టాలకు విరుద్ధంగా వెంచర్లు వేయడమే కాకుండా అక్రమార్కులు ఇనాం భూములను ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం కొనసాగిస్తున్నారన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ రెవిన్యూ అధికారులు మౌనం దాల్చడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ప్రశ్నించారు...? కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి సాయి, అసెంబ్లీ అధ్యక్షుడు బాపనపల్లి కళ్యాణ్, వంగా రవిశంకర్, సందీప్, ధనుంజరు తదితరులు పాల్గొన్నారు.