Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత ఆవునూరి మధు
నవతెలంగాణ-కొణిజర్ల
విప్లవ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి, చీలిక వాదులు అనుసరిస్తున్న రివిజనిస్టు విధానాలను తిప్పికొట్టాలని సీపీఐ(ఎంఎల్-న్యూడెమోక్రసీ) రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆవునూరి మధు పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. మండల పరిధిలోని రామనర్సయ్య నగర్ గ్రామంలో శనివారం ఆ పార్టీ డివిజన్ నాయకుడు ఖాసీమ్ అధ్యక్షతన పార్టీ మండల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రతిఘటన పోరాటం ద్వారానే భూ సమస్య పరిష్కారం అవుతుందని, దీని ద్వారానే గోదావరి లోయ పరివాహక ప్రాంతంలో పది లక్షల ఎకరాల భూములను పేదలు సాధించుకోవటం జరిగిందన్నారు. ఫారెస్ట్, భూస్వాముల దోపీడి, దౌర్జన్యాలను ప్రతిఘటన పోరాటం ద్వారానే ఎదిరించటం జరిగిందన్నారు. పోరాటం విఫలమైందనే పేరుతో కొంతమంది న్యూడెమోక్రసీ పార్టీ నుంచి చీలిపోయి సొంత కుంపటి పెట్టుకొని పసలేని అబద్దాలతో కూడిన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. చేతనైతే పోరాటాలలో పోటీ పడాలని సవాల్ చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పరకాల నాగన్న, తిరుమలా యపాలెం మండల కార్యదర్శి రాజేంద్రప్రసాద్, పీఓడబ్ల్యు రాష్ట్ర అధ్యక్షురాలు ఝూన్సీ, లక్ష్మీ, సంధ్య, పౌర హక్కల సంఘం జిల్లా కార్యదర్శి విప్లవ కుమార్, గ్రామ నాయకులు కోయిడ వెంకటేశ్వర్లు, కిషన్, బాషా, మనిగే వెంకటేశ్వర్లు, ఖాసీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.