Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న మంత్రులు
నవతెలంగాణ-వైరా
వైరా మునిసిపల్ కేంద్రంలో అన్ని హంగులతో పూర్తి చేయబడిన ఇండోర్ స్టేడియంను రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వి శ్రీనివాస గౌడ్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్‌తో కలిసి ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించనున్నారు. తొలుత పర్యాటక శాఖ ఆధ్వర్యంలో వైరా ప్రాజెక్ట్‌లో పర్యాటకుల కోసం బోటు షికారును ప్రారంభించనున్నారు. ఉదయం 11.45 నిముషాలకు బోటు షికారు ను, మధ్యాహ్నం 12.30 నిముషాలకు ఇండోర్ స్టేడియంను ప్రారంభిస్తారని ఎంపిడిఓ మరియు ఇంచార్జీ మునిసిపల్ కమిషనర్ ఎన్ వెంకట పతి రాజు తెలిపారు.
2018 లో 89 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఇండోర్ స్టేడియంకు అప్పటి ఎమ్మెల్యే బాణోత్ మదన్‌లాల్ శంకుస్థాపన చేశారు. ఇండోర్ స్టేడియం అసలు చరిత్ర 2005లో అప్పటి రాష్ట్ర మంత్రి కోనేరు రంగారావు స్టేడియంకు శంకుస్థాపన చేశారు. అదే రోజు ఆనాటి గ్రామ పంచాయతీ కార్యాలయ భవనానికి కూడా మంత్రి శంకుస్థాపన చేశారు. ఆనాడే స్టేడియం నిర్మాణ కోసం 20 లక్షలు మంజూరు చేశారు. దఫా దఫాలుగా దానికి నిధులు మంజూరు చేశారు. ఎంతో మంది కలెక్టర్లు, కింది స్థాయి అధికారులు స్టేడియం పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశాలిచ్చారు. అయినప్పటికీ 17 ఏళ్లుగా దాని నిర్మాణం సాగింది. కాంట్రాక్టర్లు, శాఖలు కూడా మారినవి. కాని టిఆర్ఎస్ మొదటి ప్రభుత్వం దాని పూర్తి స్థాయిలో నిర్మించుటకు మరికొన్ని నిధులు మంజూరు చేయగా 2018 ఏప్రిల్ 13న మరోసారి శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల తర్వాత కూడా అది పూర్తి అయ్యే లక్షణాలు కనపడనందున వైరా మునిసిపాలిటీ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిన జిల్లా కలెక్టర్ విపి గౌతం కాంట్రాక్టర్‌కు పదే పదే ఆదేశాలిచ్చారు. ఎట్టకేలకు ఇండోర్ స్టేడియంలో వుడెన్ ష టిల్ కోర్టులు, విద్యుదీకరణ అలంకరణ తదితర పనులను పూర్తి చేయించారు.వైరా క్రీడాకారుల చిర కాల స్వప్నం నేడు నెరవేరుతుంది.