Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎంపీ మిడియం బాబురావు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఆదివాసీలు తరతరాలుగా సాగు చేసుకుంటున్న పోడు భూముల జోలికి వస్తే టీఆర్ఎస్ ప్రభత్వమా ఖబడ్దార్ అంటూ మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) రాష్ట్ర నాయకులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం ములకపాడు యలమంచి సీతారామయ్య భవన్లో మండల కమిటీ సమావేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు యలమంచి వంశీకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా బాబురావు మాట్లాడుతూ ప్రభుత్వం సర్వే చేసిన భూములకు వెంటనే హక్కు పత్రాలు ఇచ్చే విదంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఆదివాసీలను మోసం చేస్తుందన్నారు. పోడు భూముల సర్వే సమయంలో సాగుదారులందరికీ హక్కు పత్రాలు అందజేస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు ఆ హామీలను తుంగలో తొక్కి ఫారెస్టు అధికారు లతో దాడులకు తెగబడుతు న్నారని ఆయన ఆరోపించారు. భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్న పోడు సాగుదాలకు హక్కు పత్రాలు అందజేయక పోతే మరో పోడు భూమి పోలి కేక పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గ్రామాలలో ఎఫ్ఆర్సి కమిటీలు వేసే విదంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. గ్రామ సభ నిర్వహించకుండా ఫారెస్టు అధికారులు పోడు భూముల జోలికి వెళ్లరాదని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ నెల 28, 29 తేదీలలో జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున గ్రామీణ బంద్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్రంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక, వ్యవశాయ చట్టాలకు తూట్లు పొడిచి మత రాజకీయాలు పాల్పడుతోందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపడం కోసం లౌకిక శక్తులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఐ(ఎం) పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..తెలంగాణ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన బ్యాక్లాగ్ పోస్టులు నోటీఫికేషన్ ఇచ్చిన వెంటనే భర్తీ చేయాలన్నారు. లేదంటే పార్టీ ఆధ్వర్యంలో ఉద్యోగులను ఐక్యం చేసి ఆందోళనలు, పోరాటాలు నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిసిసిబి చైర్మన్ యలమంచి రవికుమార్, మండల కార్యదర్శి కారం పుల్లయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు కొర్సా చిలకమ్మ, మర్మం చంద్రయ్య, బొల్లి సూర్యచందర్‌రావు, యలమంచి శ్రీనుబాబు, మర్మం సమ్మక్క, మండల కమిటీ సభ్యులు కట్టోజి గోవర్దన్, సోయం వీర్రాజు, పూనెం శోభారాణి, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.