Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆదివాసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
- ఐటీడీఏ ఎదుట ధర్నా
నవతెలంగాణ-భద్రాచలం
వారం రోజుల క్రితం భద్రాచలం పట్టణంకు చెందిన ఇర్పా రాధ ఆత్మహత్య సంఘటన కు కారణమైన శేఖర్ అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఆదివాసీ, గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఐటీడీఏ ఎదుట ధర్నా చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ రాధ తల్లిదండ్రులను ఆదుకోవాలని ర్యాలీగా ఐటీడీఏను ముట్టడించారు. ఐటీడీఏ ముట్టడి విషయం తెలుసుకున్న ఐటీడీఏ అధికారులు గేట్లకు తాళం వేసి గేటు అవతల ఉంచి నిరసన చేసుకోవాలని సూచించారు. దీంతో కోపోద్రిక్తులైన ఆదివాసీ, గిరిజన సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు గేట్లను తోసుకొని ఐటీడీఏలోపలికి వెళ్లి నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఐటీడీఏ పీవో లేకపోవడంతో ఏవో వచ్చి నిరసన చేస్తున్న వారిని కలిసి నిందితుడిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకునే విధంగా సహకరిస్తామని చెప్పడంతో బాధితులు నిరసన కార్యక్రమంను విరమించారు. రాధ కుటుంబ సభ్యులను ఆదుకోవాలని పేర్కొన్నారు. నిందితుడిని ఏదో నామమాత్రంగా కేసులు పెట్టి మభ్యపెట్టకుండా కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ, భద్రాద్రి ఆదివాసి సమితి అధ్యక్షులు పూనెం కృష్ణ, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు సరియం కోటేశ్వరరావు, ఏవిఎస్పీ రాష్ట్ర కార్యదర్శి పాండ్రు హేమ సుందర్, ఏవిఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూపా నాగేశ్వరరావు, అఖిల భారత మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి గోనె రేణుక, ఆదివాసి మహిళా శక్తి నాయకురాలు సుధా రాణి, వివిధ సంఘాల నాయకులు కారం పద్మ, శీలం దుర్గ, దుర్గ, కామేశ్వరి, కృష్ణార్జున రావు, కామరాజు, శేఖర్, పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.