Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
రాష్ట్ర ప్రభుత్వం వచ్చే విద్యాసంవత్సరం నుండి అన్ని ప్రభుత్వ పాఠశాలలలో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టనున్న దృష్ట్యా అందరు ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమ బోధనలో మెళుకువలు నేర్పించడానికై అజీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీ సహకారంతో ఒక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఎన్నికచేయబడ్డ 45 మంది ఉపాధ్యాయులకు ఆంగ్లమాధ్యమ బోధనపై శిక్షణను రాష్ట్రస్థాయిలో విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆన్లైన్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హాజరైనారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికే 173 ప్రాధమిక, 36 ప్రాధమికోన్నత, 72 ఉన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టడం జరిగిందని, వచ్చే విద్యాసంవత్సరం జిల్లాలోని అన్ని ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం జరుగుతుందని తెలిపారు. ముందుగా జిల్లాస్థాయిలో 60 మంది ప్రాధమిక పాఠశాల ఉపాధ్యాయలకు శిక్షణ ఇవ్వడం జరుగుతున్నదని, ఈ శిక్షణ 5 రోజుల పాటు కొనసాగనున్నదని తెలిపారు. అనంతరం శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ఆయా మండలాలలో ఉపాధ్యాయులకు 5 రోజుల పాటు శిక్షణ ఇవ్వవలసి ఉంటుందని తెలిపారు. కేవలం ఈ 5 రోజులే గాక తదుపరి ఆన్లైన్లో మరొక 15 రోజులపాటు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, అనంతరం ఒక పరీక్షను నిర్వహించి వీరికి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా మొత్తం జిల్లాలోని 1922 మంది సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు శిక్షణ పొందనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖర శర్మ, జిల్లా అకడమిక్ కో ఆర్డినేటర్ ఎ.నాగరాజ శేఖర్, జిల్లా కో ఆర్డినేటర్లు సతీష్ కుమార్, కిరణ్ కుమార్, సైదులు, శిక్షకులు, మండలాల నుండి విచ్చేసిన 60 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.