Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బీజేపీ కార్మిక, ప్రజావ్యతిరేక విదానాలను ప్రతిఘటించాలి
- కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలకు నిరసనగా జరిగే దేశ వ్యాపిత సార్వత్రి సమ్మెను విజయవంతం చేయడం ద్వారా కేంద్ర పాలకులకు గుణపాఠం చెప్పాలని కార్మిక, ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు పిలుపు నిచ్చారు. ఏఐటీయూసీ జిల్లా కార్యాలయం శేషగిరిభవన్లో సోమవారం జరిగిన కార్మిక, ఉద్యోగ సంఘాల జిల్లా స్థాయి సదస్సులో నాయకులు మాట్లాడారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర బీజేపీ ప్రభుత్వం బరితెగించి పాలన చేస్తున్నదని మండి పడ్డారు. జాతీయత, దేశభక్తి అంటూనే విధ్వంసకర విధానాలను అమలు చేస్తుందన్నారు. జాతీయ సహజ సంపద, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా స్వదేశీ, విదేశీ కార్పొరేట్లకు అమ్మివేస్తూ కార్మికులు, ఉద్యోగులు బతకు లాగేసుకుంటుందని విమర్శించారు. డీజిల్, ప్రెటోల్, వంట గ్యాస్, నిత్యావసర సరుకుల ధరలను పెంచి ప్రజల నడ్డి విరుస్తోందన్నారు. పార్లమెంట్లో ఉన్న మందబలంతో కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక చట్టాలను నిరంకుషంగా ఆమోదించుకుంటోందన్నారు. కేంద్రం తీరుతో విద్య, వైద్యం, వ్యవసాయ రంగం, ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలు అదోగతిపాలయ్యే పరిస్థితికి తీసుకొస్తున్నారన్నారు. తెలంగాణలో నాలుగు బొగ్గుబ్లాకులను ప్రైవేటీకరించి ఇక్కడ నిరుద్యోగుల ఆశలపై నీల్ళు చల్లిందని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగుల భద్రత, హక్కులకే కాకుండా దేశ ఆర్ధిక స్వావలంభనకే కేంద్రం ముప్పు తెస్తున్న పరిస్థితిలో సమ్మె ఆయుధం ద్వారా కేంద్రానికి బుద్ధి చెప్పాల్సిన వసరం ఉందన్నారు. మార్చి 28, 29 సమ్మె ద్వారా బీజేపీ ప్రభుత్వ దేశ విధ్వంసకర విధానాలను తిప్పికొట్టేందుకు భారత సమాజం సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ సదస్సులో సీఐటీయూ జిల్లా నాయకులు ఏజె.రమేష్, ఏఐటీయూసీ జిల్లా నాయకులు గుత్తుల సత్యనారాయణ, ఐఎన్టీయుసి జిల్లా నాయకులు ఎస్ఏ.జలీల్, హెచ్ఎంఎస్ జిల్లా నాయ కులు గుండా రమేష్, ఇఫ్లూ జిల్లా నాయకులు జె.సీతా రామయ్య, డి.ప్రసాద్, జేఏసి నాయకులు డి.శేషయ్య, వంగా వెంకట్, జి.నగేష్, పిట్టల రాంచందర్, కాలం నాగభూషనం, పి.సతీష్, బి.బాలు, ఎంవి.అప్పారావు, లక్ష్మణ్, రమేష్, ఆసీఫ్, ఎల్.విశ్వనాధం, మధుసూధన్ రెడ్డి పాల్గొన్నారు.