Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం అండ్ బిడ్జ్రి, విద్యానగర్, ప్రశాంతినగర్ కాలనీలలో వర్షాకాలంలో నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో అన్ని శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం వర్షాకాలంలో మున్సిపల్, పంచాయతీ పరిధిలో నీరు సక్రమంగా పోకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, రానున్న వర్షాకాలం వరకు నీటి నిల్వలు లేకుండా చేసేందుకు చేపట్టిన పనులను పూర్తి చేయాలని చెప్పారు. బిటిపిఎస్ రైల్వే లైను నిర్మాణంలో నిర్వాసితులైన కుటుంబాలకు నిర్మించనున్న పునరావాస కాలనీలో రహదారులు, విద్యుత్, మంచినీటి సౌకర్యాలు కల్పనకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు అందచేయాలన్నారు. ప్రజావాణిలో సమస్య పరిష్కరించాలని ప్రజలు అందచేసిన దరఖాస్తులు కొన్ని....పాల్వంచ మండలం, శేఖరం బజర గ్రామానికి చెందిన గుగులోత్ విజరు తదితరులు కెటిపిఎస్ 5, 6 దశలకు బొగ్గు రవాణా కొరకు నిర్మించిన రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోయామని, భూములు కోల్పోయిన 12 మందిలో ఆరుగురికి 2012 సంవత్సరంలో ఉపాధి కల్పించారని, మిగిలిన ఆరుగురికి ఉపాధి కల్పించాలని చేసిన పిర్యాదును పరిశీలించిన కలెక్టర్ కేటిపిఎస్ సిఈ, భూ సేకరణ విభాగం పర్యవేక్షకులకు తగు చర్యలు నిమిత్తం సిఫారసు చేశారు. కొత్తగూడెం పట్టణంలోని న్యూ గొల్లగూడెంలో గల ప్రభుత్వ స్థలాన్ని అక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బిఎస్పీ ఆద్వర్యంలో ఫిర్యాదు చేశారు. సుమారు రూ.కోటి విలువ ఉంటుందని తెలిపారు. వెంటనే రెవిన్యూ అధికారులు స్వాదీనం చేసుకోవాలని ఫిర్యాదులో పేర్కోన్నారు. అదనపు కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోకచక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.