Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
పినపాక నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పోడు భూముల సమస్య పరిష్కారించాలని స్థానిక మాజీ శాసన సభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా అటవీ శాఖ అధికారి (డీఎఫ్ఓ)ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పినపాక నియోజకవర్గంలోని ఆళ్ళపల్లి, గుండాల మండలాల్లోని పలు గ్రామాలకు చెందిన పోడు భూములలో తీస్తున్న కందకాలు సత్వరమే నిలిపివేయాలని అన్నారు. ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఉన్న భూముల్లో కందకాలు తీయడం నిలుపుదల చేయాలని, దరఖాస్తు చేసుకున్న పోడు భూములకు పట్టాలు వచ్చేంతవరకు అటవీ శాఖ అధికారులు కందకాలు ఆపాలని కోరారు. నియోజకవర్గంలో పోడు భూముల్లో సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బంది పెట్టకుండా గ్రామస్తులతో ఫారెస్ట్ అధికారులు ఒకరినొకరు సమన్వయంతో పోడు భూముల సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పారు. మామకన్ను గ్రామం (కల్తీ గుంపు)లో పోడు భూమిని ఫారెస్ట్ అధికారులు లాక్కొని కందకాలు తీయటంతో మనస్థాపానికి గురై పురుగు మందు తాగి చనిపోయిన కల్తీ కన్నయ్య నిరుపేద కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని న్యాయం చేయాలని కోరారు. డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్, సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) అధికారుల దృష్టికి రైతుల సమస్యలను తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పెండకట్ల పాపారావు, తుడుందెబ్బ రాష్ట్ర నాయకులు కోడెం వెంకటేశ్వర్లు, పూనెం నాగేశ్వరరావు, షేక్ ఖదీర్, ఉకే ఎర్రయ్య, ఉకే పాపయ్య, సాగబోయిన రాజేష్, గొగ్గెల భాస్కర్, వాసం శ్రీకాంత్, దార అశోక్, కల్తి కాంతారావు, మూడు వీరు, చింతా నాగయ్య, చింతా రామకృష్ణ, తాటి శీను, నాగమణి, పూనెం నవీన్, బండ్ల రామనాథం, బట్టు నరసింహారావు, తదితరులు పాల్గొన్నారు.