Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
మండల కేంద్రమైన ముదిగొండ పోలీస్‌స్టేషన్ నుండి ఆదివారం అర్ధరాత్రి వాచర్‌గా ఉన్న కానిస్టేబుల్ కన్నుగప్పి బైకు దొంగలు వెంకటేశ్వర్లు, మురళి ఇద్దరు పరారయ్యారు. ఇటీవల కాలంలో పోలీసులు వల్లభి వద్ద బైక్ దొంగతనం కేసులో ఇద్దరు దొంగలు వెంకటేశ్వర్లు, మురళిలను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం ఆ దొంగలను కోర్టుకు రిమాండ్ చేయాల్సి ఉండగా ఆదివారం అర్థరాత్రి దొంగలకు బేడీలు వేసి ఉన్న యాక్స్ బ్లేడ్‌తో తొలగించుకొని పారిపోయారు. పరారైన దొంగలు వెంకటేశ్వర్లు, మురళిలపై ఆంధ్రాకు చెందిన నూజివీడు, విజయవాడ, గన్నవరంతో పాటు ముదిగొండ పోలీస్ స్టేషన్లో 6 కేసులు నమోదయ్యాయి. దొంగలు వద్ద నుండి ఐదు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. పరారైన దొంగలు సువర్ణపురం, న్యూలక్ష్మీపురం పరిసర ప్రాంతాల్లో సోమవారం తిరిగారని ప్రజలు పేర్కొన్నారు. పోలీసులు గాలింపుచర్యలు చేపట్టగా ఒక దొంగ మురళి న్యూలక్ష్మీపురం, వెంకటగిరి సమీపాన మొక్కజొన్న తోటలో దొరికినట్లు తెలిసింది. మరో దొంగ వెంకటేశ్వర్లు ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఎస్ఐ తోట నాగరాజును నవతెలంగాణ దినపత్రిక వివరణ అడగటం కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు.పోలీస్ స్టేషన్ నుంచి దొంగలు పరార్ కావడంపై పలు అనుమానాలకు తావిస్తోంది.