Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాకో ఆయిల్‌పాం ఫ్యాక్టరీ కావాలి
- సాగుకు అవరోధంగా మొక్కల కొరత
- రాష్ట్రానికి ఆయిల్‌పాం రీసెర్చ్ సెంటరును తేవాలి
- అసెంబ్లీలో ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
రాష్ట్రవ్యాప్తంగా 46వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగవుతుండగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 36వేల ఎకరాల మేర ఆయిల్‌పాం తోటలను రైతులు సాగుచేస్తున్నారని, ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా సాగులో 78శాతం ఈ ప్రాంతం ఉందని, ఈ నేపధ్యంలో సత్తుపల్లి నియోజకవర్గంలో మరో ఆయిల్‌పాం ఫ్యాక్టరీని మంజూరు చేయాలని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ ప్రభుత్వ ఆలోచన మేరకు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాల్సిన సమయంలో ఈ పామాయిల్ మొక్కల తీవ్రంగా ఉందన్నారు. రాష్ట్రంలో 2.5లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు ఉండాలని ప్రభుత్వ లక్ష్యానికి 14 కోట్ల మొక్కలు అవసరం పడతాయని, కాని మన దగ్గర కేవలం 20 లక్షల మొక్కలకు మించి లేవని, అయితే ఇవి ఎక్కడ పడితే అక్కడ దొరకవని ఇవి కేవలం కోస్టారికా, థాయిల్యాండ్, మలేషియా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉందని ఈ నేపధ్యంలో సాగుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటని ఎమ్మెల్యే సండ్ర సభాపతిని కోరారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న సమయంలో ఆయిల్‌పాం రీసెర్చ్ సంటర్ను పశ్చిమ గోదావరి .ఇల్లా పెదవేగిలో కేంద్రప్రభుత్వం ఏర్పాటు చేసిందని, రాష్ట్రం విడిపోయాక మనకు రీసెర్చ్ సెంటర్ లేకపోవడంతో రైతులకు ఇబ్బందికరంగా ఉందన్నారు. ఈ నేపధ్యంలో తెలంగాణలో కూడ పరిశోధనా కేంద్రం ఏర్పాటయ్యేలా కేంద్రాన్ని కోరాలని ఎమ్మెల్యే సండ్ర అన్నారు. అలాగే పాత పద్దతిలోనే పామాయిల్ సాగుదారులకు ఎరువులు ఇతరత్రా సరఫరా ఉండాలన్నారు. అయిల్‌పాం సాగుకు 12.5 ఎకరాల వరకు సీలింగ్ ఉందని, దానిని 30 ఎకరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉద్యానశాఖకు నియోజకవర్గానికి ఒక్క అధికారి కూడా లేరని, మా నియోజకవర్గంలో ఒక అధికారి ఉన్నారని, ఈ నేపధ్యంలో రైతులకు ఉద్యాన పంటల సాగుకు సూచనలు అందించేందుకు ఇబ్బందిగా ఉందని, దీంతో పాటు ఉద్యాన, వ్యవశాఖ వేర్వేరనే ఆలోచన అధికారుల్లో ఉందని, ఈ రెండు శాఖలను అనుసంధానం చేసి రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు. దీంతోపాటు ఇండ్లపై వెళ్తున్న విద్యుత్ లైన్లను తొలగించాలని, అలాగే గ్రామాల్లో విద్యుత్ స్తంభాలను కొనుగోలు చేసుకునేందుకు సర్పంచులకు అనుమతించాలని కోరగా సంబంధిత మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి సావధానంగా స్పందించి సమాధనాలిచ్చారు.