Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం
- ఇబ్బందులు ఎదుర్కొంటున్న సన్న కారు రైతులు
నవతెలంగాణ-బోనకల్
సాదాబైనామా సమయంలో రెవెన్యూ కిందిస్థాయి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల సన్న, చిన్న కారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ధరణి వెబ్ సైట్ ను ప్రారంభించింది. ఈ ధరణి తో రైతులకు ఒక్క సమస్య కూడా ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఎంతో ఆర్భాటంగా ప్రకటించారు. కానీ గ్రామీణ క్షేత్రస్థాయిలో ధరణి వలన సన్న, చిన్నకారు రైతుల తో పాటు ఇతర రైతులు తమ పొలాలు పట్టాదారు పాసుపుస్తకం లో ఎక్కక మరికొందరు అసలు పట్టాదారు పాసు పుస్తకాలు రాక ఇంకొందరు ఉన్న పొలంలో కొంత ఎక్కించి మరికొంత ఎక్కించ కాకపోవటంతో ఇలా వివిధ రకాల సమస్యలతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని తూటికుంట్ల గ్రామానికి చెందిన సుమారు 25 మంది రైతులు తమకు పట్టాదారు పాసు పుస్తకాలు రాలేదని మరికొందరు తమకు పట్టాదారు పాస్ పుస్తకం లో ఎక్కిందని తహసీల్దార్ కార్యాలయం ముందు సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో సోమవారం ధర్నా నిర్వహించారు. దాదాపు గంట పాటు తమ సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం తాసిల్దార్ రావూరి రాధిక ఆందోళనకారుల వద్దకు వచ్చారు. దీంతో రైతులు తమ సమస్యలను ఆమెకు వివరించారు. దీంతో తాసిల్దారు స్పందిస్తూ ఒక్కొక్కరు ఎవరు సమస్యను వారే విడివిడిగా రాసి ఇవ్వాలని ఆ వివరాలు ఆధారంగా సమస్య పరిష్కారం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తారపు అచ్చయ్య కు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉండగా ఎకరంన్నర భూమి మాత్రమే పట్టాదారు పాస్ పుస్తకం లో ఎక్కిందని తెలిపారు. సాధినేని కృష్ణకు 22 గుంటల భూమి ఉండగా 13 గుంటల భూమి మాత్రమే పాస్ బుక్ లోకి ఎక్కింది. కంచర్ల వెంకటేశ్వర్లు 1.15 ఎకరాలు ఉండగా 1.04 ఎకరాలు మాత్రమే ఎక్కింది. దామాల సుందర్రావుకు 20 గుంటల భూమి ఉండగా అసలు పాస్ బుక్ రాలేదు. దుంపల రాజారత్నంకు 3 ఎకరాలు ఉండగా 2.20 మాత్రమే ఎక్కిందని తెలిపారు. చితారు పిచ్చమ్మ కు 0.25 భూమి ఉండగా 0.85 భూమి మాత్రమే ఎక్కిందని తెలిపారు. ఇలా పలువురి రైతుల సమస్యలు ఉన్నాయి.
ఈ సందర్భంగా సిపిఎం మధిర పట్టణ మాజీ కార్యదర్శి పాపినేని రామనర్సయ్య, సిపిఎం మండల కార్యదర్శి దొండపాడు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇటువంటి సమస్యలతో అనేక గ్రామాలలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరణి వెబ్ సైట్ తీసుకువచ్చి లేని అనేక సమస్యలను రైతులకు సష్టించిందని విమర్శించారు. ధరణి లేక ముందు ఇటువంటి సమస్యలు వస్తే తాసిల్దార్ వెంటనే పరిష్కారం చేసేవారని కానీ ధరణి వ్యవస్థను తీసుకువచ్చి రైతులకు కష్టాలు తీసుకు వచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, మాజీ ఎంపీపీ తుళ్లూరు రమేష్ బాధిత రైతులు తదితరులు పాల్గొన్నారు.