Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
మున్సిపల్ నగర పురపాలక సంస్థ ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న డ్రైవర్లు, ఇంజినీరింగ్, వాటర్ వర్క్స్, ఎలక్ట్రిషియన్లు, పంపు ఆపరేటర్లు, బిల్ కలెక్టర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లు, పారిశుధ్య కార్మికులు, సిబ్బందికి వేతనాలు పెంపు పట్ల జిల్లా మున్సిపాలిటీ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. మంగళవారం ఖమ్మం నగర పురపాలక సంస్థ కార్యాలయ భవనంలో కార్మికులు, సిబ్బంది, డివిజన్ కార్పొరేటర్లు సంబరాలు చేసుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరభిషేకం చేశారు. ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాలను 30 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మున్సిపాలిటీల్లో పనిచేస్తున్న 970 మంది సిబ్బందికి లబ్ధి చేకూరనుండగా, పెంచిన వేతనాలను త్వరలోనే అమలు చేయనున్నారు. దీంతో, మున్సిపల్ ఔట్ సోర్సింగ్ పారిశుధ్య కార్మికులు, డ్రైవర్లు, కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి పువ్వాడ అజరు కుమార్ నేతత్వంలో ఉద్యోగులు, కార్మికుల కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వేతనాలు పెంచుతూ సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు, వారి కృషితోనే వేతనాలు పెరుగుతున్నయని నగర మేయర్ పునుకొల్లు నీరజ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా, కార్పొరేటర్లు కర్నాటి కృష్ణ, దోరేపల్లి శ్వేత, పగడాల శ్రీవిద్య, ప్రశాంత్ లక్ష్మి, ఆళ్ల నిరీషా, రుద్రగాని శ్రీదేవి, దండా జ్యోతి రెడ్డి, రాపర్తి శరత్, బుర్రి వెంకటేశ్వర్లు, ఎస్. కె మక్బూల్, సంఘం నాయకులు అధ్యక్షులు ఫణి, గౌరవ అధ్యక్షులు వినరు, దాదే సతీష్, జ్యోతి, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.