Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మృతుల్లో తండ్రీకొడుకులు
- పలువురికి గాయాలు
నవతెలంగాణ-కరకగూడెం/వేంసూరు
వేరువేరు రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందిన ఘటన భద్రాద్రి జిల్లా కరకగూడెం, ఖమ్మం జిల్లా వేంసూరు మండలాల్లో జరిగింది. మృతుల్లో తండ్రీకొడుకులు న్నారు. భద్రాద్రి జిల్లా గుండాల మండలం దామెర తోగు గ్రామానికి చెందిన కల్తీ కృష్ణారావు కుటుంబ సభ్యులు, బంధువుతో కలిసి ట్రాలీ వాహనం(టీఎస్25టీ 5686) లో ఆళ్లపల్లి మండలంలోని లొద్దిగూడెం గ్రామంలోని రెక్కల రామయ్య గుడికి సోమవారం బయలుదేరి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి సమయంలో తిరిగి వస్తుండగా కరకగూడెం మండలంలోని మద్దెల గూడెం గ్రామం రెండు పడకల ఇళ్ల సమీపంలోకి రాగానే వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న తాడ్వాయి మండలం వీరాపురం గ్రామానికి చెందిన స్వర్ణ (30), గుండాల మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సమ్మక్క (40) అక్కడికక్కడే మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను నాలుగు 108 వాహనాల్లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. స్థానిక ఎస్ఐ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కుంచపర్తి గ్రామానికి చెందిన మద్దిరెడ్డి కృష్ణారెడ్డి(75)ని ఆసుపత్రిలో చూపించేందుకు కుమారుడు శ్రీనివాసరెడ్డి(50) మంగళవారం గ్రామం నుండి సత్తుపల్లికి ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మర్లపాడు శివారులో ఎదురుగా ట్రాలీ ఆటో వచ్చి ఢ కొనడంతో తండ్రి కొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. ట్రాలీ వాహనంలో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నది. వేంసూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కుటుంబంలో పెద్ద దిక్కు అయిన తండ్రి కొడుకులు మృతి చెందటం ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతంలో అదే ప్రదేశంలో అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.