Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్ఆర్ఈజీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లకు ఊరట
- ఆందోళనలతో మూడేళ్లకు దిగివచ్చిన ప్రభుత్వం
- ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 579 మందికి లబ్ధి
నవతెలంగాణ- ఖమ్మప్రాంతీయప్రతినిధి
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్)లో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లను ప్రభుత్వం 2019 మార్చి 22న తొలగించింది. 4779 సర్క్యూలర్ ద్వారా క్షేత్రస్థాయి పర్యవేక్షకులపై పనిభారం, ఒత్తిడి పెంచింది. రాష్ట్రవ్యాప్తంగా 7,600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లకు ప్రభుత్వం పొమ్మనలేక పొగబెట్టింది. నాటి నుంచి వివిధ కార్మిక, కులసంఘాలు, రాజకీయ పార్టీల మద్దతుతో ఫీల్డ్ అసిస్టెంట్లు ఆందోళనబాట పట్టడంతో ప్రభుత్వం దిగివచ్చింది. ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవడంతో పాటు సెర్ప్, మెప్మా ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా వేతనాలు ఇస్తామని సీఎం ప్రకటించారు. నాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి, సంబంధిత అధికారులు సూచించినా వినకుండా ఫీల్డ్అసిస్టెంట్లు ఆందోళన బాట పట్టారని, ఇప్పుడు వారు తప్పు తెలుసుకోవడంతో విధుల్లోకి తీసుకుంటున్నట్లు సీఎం ప్రకటించారు. దాదాపు మూడేళ్లుగా ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలతో చెలగాటమాడిందని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉద్యమ ఫలితంగానే ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకున్నారని పేర్కొన్నాయి.
ఛిన్నాభిన్నమైన ఫీల్డ్‌అసిస్టెంట్ల జీవితాలు...
మూడేళ్ల క్రితం ప్రభుత్వం ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించడంతో పలువురి జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. ఉద్యోగం నుంచి తొలగించారనే మనస్తాపం, అనారోగ్యం, ఆత్మహత్యలు ఇలా వివిధ కారణాలతో రాష్ట్రంలో 61 మంది వరకు చనిపోయారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 579 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వీరిలో ఖమ్మంలో 416, భద్రాద్రి కొత్తగూడెంలో 163 మంది ఉద్యోగాలు కోల్పోయి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నెలవారీగా రూ.10వేల వేతనం రాకపోవడంతో కుటుంబాన్ని పోషించుకోవడానికి వివిధ వృత్తులు చేపట్టారు. మనస్తాపంతో కొందరు ఆత్మహత్యలకు యత్నించారు. అలుపెరగకుండా ఆందోళనలు నిర్వ హించారు. ఇటీవల వైరాలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సైతం తమ గోడు చెప్పుకున్నారు. అనేక రోజుల పాటు ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్రాల్లోని ధర్నా చౌక్‌లలో నిరసన తెలిపారు. ఈ క్రమంలో ఆత్మహత్యలకు సైతం యత్నించిన వారున్నారు.
తాము పస్తులుండి...కుటుంబాన్ని పస్తులుంచి...
అనేక మంది ఫీల్డ్‌అసిస్టెంట్ల కుటుంబాలు 'ఉపాధి' కోల్పోవడంతో అవస్థలు ఎదుర్కొన్నాయి. కొందరు పిల్లల చదువులు మధ్యలో ఆగాయి. ప్రైవేట్ పాఠశాలల్లో చదివే పిల్లల్లో కొందర్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించారు. కొందరు కంట్రోల్ బియ్యంతో కడుపు నింపుకున్నారు. ఒక్కోసారి పూట గడవక కుటుంబం మొత్తం పస్తులున్న దాఖలాలున్నాయి. రఘునాథ పాలెం మండలం చింతగుర్తికి చెందిన పేరపోగు ఉపేందర్, గణేశ్వరానికి చెందిన భూక్యా రవి కుటుంబాలు మరింతగా చితికిపోవడంతో ఒక్కొక్కరూ రెండేసి సార్లు ఆత్మహత్యకు సైతం యత్నించారు. కుటుంబ సభ్యులు, సహౌద్యోగులు సకాలంలో గుర్తించి నిలువరించారు. వీరిద్దరే కాదు రాష్ట్రంలో అనేక మంది ఫీల్డ్‌అసిస్టెంట్ల జీవితాలు ఛిన్నాభిన్నం అయ్యాయి. మరోవైపు ఫీల్డ్‌అసిస్టెంట్ల బాధ్యతలను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించడంతో వారు సైతం పనిఒత్తిడితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆందోళనలతో దిగివచ్చి ప్రభుత్వం విధుల్లోకి తీసుకోవడంతో ఫీల్డ్అసిస్టెంట్లు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి, స్వీట్లు పంచుకున్నారు.
పోరాట ఫలితమే విధుల్లోకి...
పోరాట ఫలితంగానే ప్రభుత్వం విధు ల్లోకి తీసుకుంది. తమ పోరాటాలకు దన్నుగా నిలిచిన వివిధ ట్రేడ్ యూని యన్లు, యువజన, కులసంఘాలు, వివిధ రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు. ఆలస్యంగానైనా ప్రభుత్వం విధుల్లోకి తీసుకున్నందుకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఇచ్చిన హామీ మేరకు ఫీల్డ్అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటారనే నమ్మకం ఉంది.
- తూరుగంటి సూర్యం,
తెలంగాణ ఫీల్డ్‌అసిస్టెంట్స్ యూనియన్,
ఖమ్మం జిల్లా కార్యదర్శి