Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్వాన్నంగా అనిశెట్టి-ఆళ్ళపల్లి రోడ్డు
- డబుల్ రోడ్డుకు నిధులు మంజూరు చేయాలి
- మూడు లో లెవెల్ వంతెనలకు ఎత్తులో కొత్త వంతెనలు ఏర్పాటు చేయాలి
- ఏండ్ల తరబడి ఎదురుచూస్తున్న మండల ప్రజలు
నవతెలంగాణ-ఆళ్ళపల్లి
తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లాలు అందులో చిన్న మండలాలు ఏర్పాటైతే ఆళ్ళపల్లి మండలం అభివృద్ధికి చేరువలో ఉంటుందనుకున్న స్థానికులు కనీసం ప్రధాన రహదారి సౌకర్యానికి నోచుకోవడం లేదు. జిల్లా కేంద్రానికి 45 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆళ్ళపల్లి మండలంపై ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు గానీ ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం గుంతల రోడ్డులో ప్రయాణం చేయలేక మండల వాసులు నరకయాతన అనుభవిస్తున్నారు. కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి ఆళ్ళపల్లి వరకు 46 కిలో మీటర్ల దూరంలో ఉంది. అందులో జిల్లా కేంద్రం నుంచి అనిశెట్టిపల్లి వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్డు రహదారి బాగుంది కానీ అనిశెట్టిపల్లి నుంచి 35 కిలోమీటర్ల రహదారి అధ్వాన్నంగా తయారై స్థానిక ప్రజలు ప్రయాణంలో తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. కొత్తగూడెం, ఇల్లందు, పినపాక నియోజకవర్గాల్లో తాకుతూ ఉండటం, మూడు నియోజకవర్గాల హద్దులులో లెవెల్ వంతెనలు ఇలా ఉన్నాయి. ఆళ్ళపల్లి నుంచి రాయిపాడు గ్రామం వరకు పినపాక నియోజకవర్గం దీంట్లో ఒక లో లెవెల్ కిన్నెరసాని వంతెన ఉంది. మొట్లగూడెం నుంచి పున్నపు వాగు వరకు ఇల్లందు నియోజకవర్గం ఇందులో ఒక లో లెవెల్ వంతెన దయ్యాలొద్ది వాగు ఉండగా, పున్యపు వాగులో లెవెల్ వంతెన వద్ద నుంచి కొత్తగూడెం నియోజకవర్గంగా ఉంది. మూడు నియోజకవర్గాల్లో మూడు లో లెవెల్ వంతెనలు ఉండటం వాటికి సైతం హైట్లో కొత్త వంతెనలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి ముఖ్య కారణం కిన్నెరసాని, పున్యపువాగుల వద్ధ వర్షాకాలం వచ్చిందంటే గంటల తరబడి వాహనాలు ఈ లో లెవెల్స్ వంతెనల వద్ద వేచి చూడాల్సిందే. అలాగే దయ్యాలొద్ది లో లెవెల్ వంతెన వద్ద గతంలో జరిగిన దాఖలాలు ఉన్నాయి, ప్రస్తుతం ప్రమాదాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. దాటే సాహసం చేస్తే ప్రాణాలు పోయే పరిస్థితి. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండటం, అందులోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు, ఎంపీ టీఆర్ఎస్ పార్టీకే చెందిన వారు అవడం అందులోని ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరూ పట్టించుకునే సాహసం చేసినా ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించినా డబుల్ రోడ్డు నిర్మాణానికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. అలా కాకుండా స్థానిక ఎంపీ తలచుకున్నా మండల ప్రజల రోడ్డు దశా దిశా మారిపోతుంది. అనిశెట్టిపల్లి నుంచి ఆళ్ళపల్లి వరకు 36 కిలోమీటర్ల వరకు రోడ్డంతా అధ్వాన్నంగా తయారైంది. ఆళ్ళపల్లి మండలమైనా షరామామూలే అన్నట్లుగా అయిపోయింది. ఆర్అండ్ బీ అధికారులు డబుల్ రోడ్డు నిర్మాణానికి రూ.98.5 కోట్లకు పలుమార్లు ప్రణాళికలు పంపినా నిధులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాత్కాలిక మరమ్మతులకు రూ.10 లక్షల నిధులు ఉన్నప్పటికీ టెండర్ ప్రక్రియ పూర్తికాగా నిధులు మూలుగుతున్నాయి. కొత్తగూడెం వెళ్లాలంటే గంట ప్రయాణం నేడు సుమారు రెండు గంటలకు పైగా పడుతుందని, వైద్య నిమిత్తం అత్యవసర సమయంలో మరింత ఇబ్బంది అవుతోందని స్థానికులు వాపోతున్నారు. ఆళ్ళపల్లి రోడ్డు సింగిల్ రోడ్డు అందులోనూ గుంతమంయంగా మారడంతో వాహనాలకు, ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అనేక మార్లు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు, తీవ్రంగా గాయపడి శారీరకంగా, ఆర్థికంగా నష్టపోయిన ఘటనలు అనేకం. పెద్ద వాహనాలు రోడ్డు పై అంబులెన్స్, ద్విచక్ర వాహనాలకు దారి గుండా పోతూ గంటల తరబడి సైడ్ ఇవ్వలేని దుస్థితి నెలకొంది. ఇటీవల ఆళ్ళపల్లి మండలంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు అభివృద్ధి పేరిట వందల కోట్లు మంజూరు కాగా ఆయా అభివృద్ధి పనులు పూర్తి అయ్యాయే తప్పా అదే క్రమంలో ప్రధాన సమస్య అయిన ఆళ్ళపల్లి-అనిశెట్టిపల్లి రోడ్డుకు ఆ నిధులు కేటాయించడానికి అధికారులు, పాలకులు ఏ మాత్రం కృషి చేయలేదని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి తాత్కాలిక మరమ్మతులు చేపట్టిన ప్రయోజనం లేదని, మా జిల్లా కేంద్రానికి వెళ్ళే ప్రధాన రహదారికి డబుల్ రోడ్డుకు నిధులు వచ్చే విధంగా కృషి చేస్తూ అలాగే ఫారెస్ట్ అధికారులు క్లియరెన్స్ సర్టిఫికెట్ సైతం వెంటనే ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.
ప్రయాణం దినదిన గండంగా మారింది
రాంబాబు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి
ఆళ్ళపల్లి నుంచి కొత్తగూడెం వెళ్లాలంటే ప్రయాణం దినదిన గండంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గుంతల వల్ల వాహనాలు బోల్తా పడుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం సకాలంలో వైద్యం అందడం లేదు.
ఇప్పటికే మూడు దఫాలు ప్రణాళిక పంపించాం
ఆళ్ళపల్లి నుంచి అనిశెట్టిపల్లి వరకు 36 కిలో మీటర్ల డబుల్ రోడ్డు కోసం రూ.98.5 కోట్లకు మూడు దఫాలు ప్రణాళికలు పంపించాం. ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైతే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తాం. తాత్కాలిక మరమ్మతులకు నిధులు సుమారు రూ.10 లక్షలు మంజూరై ఉన్నాయి. అగ్రిమెంట్ అయితే పనులు ప్రారంభిస్తాం.
- బి.రాంబాబు, ఆర్అండ్బీ ఏఈ
పట్టించుకునే పాలకులు, అధికారులు లేరు
అనిశెట్టిపల్లి వరకు రోడ్డు అధ్వాన్నంగా తయా రైంది. మరమ్మ తులు చేపట్టాలని అడుగుతున్నాం. పలుమార్లు పాలకులకు, ఉన్నతాధి కారులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. పెరిగిన వాహనాల రద్దీ మూలంగా రోజురోజుకూ గుంతలు ఎక్కువవుతు న్నాయి. కొత్త మండలం అయితే అభివృద్ధి జరుగుతుందనుకుంటే కనీసం రోడ్డుకు దిక్కు లేదు.
- జలాల్ మహమ్మద్, ఆవాజ్ జిల్లా సహాయ కార్యదర్శి