Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు, రేపు సార్వత్రిక సమ్మె
- బీజేపేతర పార్టీల నిర్వహణ
- నేడు ఖమ్మం జిల్లా బంద్
- కార్మిక, కర్షక, ఉద్యోగ వర్గాల మద్దతు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
నరేంద్రమోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె సోమ, మంగళవారాల్లో నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనూ సమ్మె చేపట్టనున్నారు. నేడు ఖమ్మం జిల్లా బంద్‌కు బీజేపేతర పార్టీలు పిలుపునిచ్చాయి. స్థానిక పెవిలియన్‌గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తారు. ఉదయం 10 గంటలకు ఈ ప్రదర్శన ప్రారంభమవుతుంది. అలాగే ఉమ్మడి జిల్లాలోని ముఖ్య పట్టణాల్లోనూ ఇదే విధంగా ర్యాలీలు కొనసాగుతాయి. ఈ సమ్మెకు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సీఐటీయూ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టీయూ, టీఆర్ఎస్ కార్మిక విభాగం, టీఎన్టీయూసీ, ఏఐయూటీయూసీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, పెన్షనర్ల సంఘాలు, రైతు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయి.
- హౌరెత్తనున్న ఖమ్మం...
ఖమ్మం జిల్లా బంద్‌కు ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ సమ్మె పిలుపులో భాగంగా ఆయా ఉద్యోగ సంఘాలు సోమవారం విధులు బహిష్కరిస్తున్నట్లు సంబంధిత అధికారులకు నోటీసులు ఇచ్చారు. ఖమ్మం జిల్లాలో సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు సుమారు 1.70 లక్షల మంది వరకూ ఉన్నారు. వీరిలో ఆటో కార్మికులు, బిల్డింగ్ వర్కర్లు, హమాలీలు, గ్రానైట్ రంగ కార్మికులు ఇప్పటికే సమ్మెకు మద్దతు తెలిపి బంద్ చేపడుతున్నట్లు ప్రకటించారు. దేశభక్తి మాటున దేశ సంపదను అమ్ముతున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ ముద్రించిన సుమారు 5000 బుక్లెట్స్, లక్ష కరపత్రాలను ఖమ్మం జిల్లాలో పంచారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లు, ఐకేపీ వర్కర్లు, గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బంది...ఇలా రంగాల వారీగా కరపత్రాలు ముద్రించారు. 700కు పైగా గ్రూప్ మీటింగ్‌లు నిర్వహించారు. ఐదురోజులుగా మైక్ ప్రచారం నిర్వహించారు. బీజేపేతర రాజకీయ పార్టీలన్నీ సమ్మెకు మద్దతు ఇవ్వడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగనుంది. సోమవారం బంద్‌ను దృష్టిలో ఉంచుకుని వివిధ ప్రైవేట్ స్కూల్స్ ఆదివారం తరగతులు నిర్వహించాయి. సోమవారం సెలవు ప్రకటించాయి. ఆర్టీసీ సంఘాలు, ఆటో, కార్ ట్రావెల్స్, లారీ ఓనర్స్, డ్రైవర్స్ అసోసియేషన్లు సమ్మెకు మద్దతు తెలిపిన నేపథ్యంలో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించనుంది.
- మార్కెట్లు, గోదాంలు, బ్యాంకులూ అన్నీ బంద్...
సమ్మె నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలను మూసివేయనున్నారు. మార్కెట్లు, గోదాంలు ముందస్తుగా సెలవు ప్రకటించాయి. చాంబర్ ఆఫ్ కామర్స్, వివిధ వర్తక వాణిజ్య సంఘాలు సమ్మెకు మద్దతు తెలిపాయి. ప్రైవేటీకరణను నిరసిస్తూ బగ్గు గనుల్లోనూ సమ్మె సైరన్ మోగనుంది. విద్యుత్ ఉద్యోగులు సైతం ప్రైవేటీకరణను నిరసిస్తూ బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఎస్ఈ ఆఫీసు ముందు ధర్నా నిర్వహించనున్నారు. 1104, 327, ఇంజినీర్స్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో సమ్మె పాటించనున్నారు. బ్యాంకులు, ఎల్ఐసీ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయా రంగాల ఉద్యోగులు సమ్మెలో పాల్గంటారు.
- రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు...రైతు, కూలీ సంఘాలు సైతం...
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులు సైతం సమ్మెకు మద్దతు ప్రకటించారు. టీచర్స్ యూనియన్లు స్వచ్ఛంద బంద్‌కు పిలుపునిచ్చాయి. ఏబీవీపీ మినహా మిగిలిన విద్యార్థి సంఘాలు సైతం సమ్మెలో పాల్గంటున్నాయి. గ్రామీణ బంద్ పేరుతో వ్యవసాయ కార్మికులు, రైతులు నిరసన తెలపనున్నారు. సమ్మెకు మద్దతుగా టీచర్స్ యూనియన్లు ఆదివారం ర్యాలీలు నిర్వహించాయి. వివిధ సంఘాలు సైతం ప్రచారం నిర్వహించాయి. అఖిలపక్షాల ఆధ్వర్యంలో ప్రెస్మీట్లు నిర్వహించి సమ్మె ఆవశ్యకతను వివరించారు. అన్ని రంగాలనూ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ సమ్మె నిర్వహిస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు. దీనికితోడు వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోళ్లు, గిట్టుబాటు ధరలు, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, మండిపడుతున్న పెట్రో, గ్యాస్ ధరలకు నిరసనగా కూడా ఈ సమ్మె చేపడుతున్నట్లు ఆయా సంఘాల నేతలు వివరించారు.
బీజేపీ విధ్వంసకర చర్యలను నిరసిస్తూ సమ్మె
నున్నా నాగేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం జిల్లా కార్యదర్శి
బీజేపీ విధ్వంసకర చర్యలను నిరసిస్తూ సమ్మె చేపడుతున్నాం. సోమ, మంగళవారాల్లో నిర్వహించే ఈ సమ్మెను విజయవంతం చేయాలి. మోడీ ప్రభుత్వం కార్మిక, కర్షక, దేశ వ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది. కార్పొరేట్లకు ఇష్టారాజ్యంగా లాక్‌లు ఎత్తివేసింది. దేశభక్తి మాటున మతోన్మాద చర్యలను ప్రేరేపిస్తోంది. లౌకికవాద పరిరక్షణకు పూనుకోవాలి. కార్పొరేట్లకు దేశాన్ని కట్టబెట్టకుండా అడ్డుకోవాలి.