Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పోరాటాల పురిటిగడ్డ 'ముష్టికుంట్ల'
- ధ్వజస్తంభంపై కమ్యూనిస్టు జెండా ఆవిష్కరణ చేసిన నరసింహారావు
- సమస్యల నుంచి పుట్టిందే సీపీఐ(ఎం) కార్యాలయ నిర్మాణ ఆలోచన
- 1952 నుంచి 2020 వరకు అన్ని పదవులు సీపీఐ(ఎం)వే
నవతెలంగాణ-బోనకల్
అగ్రహారికుల పెత్తనంకు వ్యతిరేకంగా ఆనాడు ముష్టికుంట్ల గ్రామ ప్రజలు పోరాటాలు నిర్వహించారు. 1944 కంటే ముందు ముష్టికుంట్ల గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ వాసన కూడా లేదు. ఆ సమయంలో ఆంధ్ర ప్రాంతంలోనే కన్నెవీడు నుంచి కొంతమంది ముష్టికుంట్లలో పొలాలు కొనుగోలు చేసి వ్యవసాయం చేశారు. వీరందరూ కమ్యూనిస్టు భావజాలంతో ఉన్నారు. అదే సమయంలో అగ్రహారికుల పెత్తనం సాగుతుంది. గ్రామస్తుల చేత వెట్టి చాకిరి చేయించుకుంటూ తీవ్ర అణచివేతకు గురి చేస్తున్నారు. ఈ క్రమంలో లో వలస వచ్చిన వారు ముష్టికుంట్ల గ్రామ ప్రజలలో కమ్యూనిస్టు భావజాలం నెలకొల్పారు. ఆ విధంగా గ్రామంలో కమ్యూనిస్టు పార్టీకి పునాది పడింది. 1944 నుంచి గ్రామంలోకి వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం దళాలు ప్రవేశించాయి. అక్కడ నుంచి గ్రామంలో కమ్యూనిస్టు పార్టీ బలం పెరుగుతూ వచ్చింది. గ్రామంలో దళాలు యువకులను సమీకరించి నైజాం సైన్యానికి, రజాకార్లకు వ్యతిరేకంగా కర్ర శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణలో చల్ది వీరస్వామి, పిల్లలమర్రి లక్ష్మీనారాయణ, ఆకేన వెంకటరామయ్య తదితరులు శిక్షణలో రాటు తేలారు. ఆ విధంగా కమ్యూనిస్టు పార్టీ కి పునాది పడింది.
దళాలు రాక కూడా పెరిగింది. దళాల సమాచారం చెప్పాలంటూ రజాకార్లు చాలామంది గ్రామస్తులను పట్టుకెళ్ళి నాగులవంచ క్యాంపులో తీవ్ర హింసకు గురి చేశారు. వందనంలో జరిగిన దాడిలో ముష్టికుంట్ల గ్రామానికి చెందిన సగం మంది ప్రజలు పాల్గొన్నారు. ఈ సమయంలో చొప్పకట్లపాలెం, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన ఏడుగురు మిలటరీకి చిక్కారు. ఈ ఏడుగురిని కాల్చి వేయమని మిలటరీ ఆదేశాలు ఇచ్చింది. చివరగా వీరిని బోనకల్లు తీసుకువచ్చారు. ఆ సమయంలో వేపకుంట్ల, వెంకటాపాలెం గ్రామానికి చెందిన పిచ్చయ్యను అప్పటికే మిలటరీ కాల్చి వేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో ఈ ఏడుగురు తో ఆయన మాట్లాడారు. తనను కాల్చివేయడం ఖాయమని మీరు వెళ్లి కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తే మిమ్మలను ఏదోరకంగా కాపాడతానని తెలిపారు. దీంతో వారు ఏడుగురు అంగీకరించడంతో వందనం దాడిలో వాళ్లకు ఎటువంటి సంబంధం లేదని తానే తీసుకువచ్చానని వారిని వదిలి వేయమని వేడుకొన్నారు. దీంతో ఆ ఏడుగురుని జైలుకు తరలించి, ఆ తర్వాత నిజాం సైన్యం పిచ్చయ్యను కాల్చి వేసింది. ఇదే సమయంలో ఆంధ్ర ప్రాంతం నుంచి టీచర్ గా నరసింహారావును దళాలు ముష్టికుంట్ల పంపించాయి. నరసింహారావు విద్యా బోధన పేరుతో గ్రామంలో రహస్యంగా కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం కోసం కృషి చేశాడు. ఈ విధంగా నరసింహారావు టీచర్‌గా వచ్చి కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధిలో విశేషమైన కృషి చేశాడు. ఆ సమయంలో అగ్రహారికుల దౌర్జన్యం, దోపిడీ కొనసాగుతూనే ఉంది. దీంతో గ్రామస్తులు అందరూ అగ్రహారికుల పెత్తనానికి నిరసనగా ధ్వజస్తంభంపై కమ్యూనిస్టు పార్టీ జెండాను ఎగురవేయాలని నిర్ణయించారు. అయితే జెండా ఎగరవేయడానికి గ్రామంలో ఎవరూ అగ్రహారికులకు వ్యతిరేకంగా ముందుకు రాలేకపోయారు. ఆ సమయంలో నరసింహారావు తాను కమ్యూనిస్టు పార్టీ జెండాను ధ్వజస్తంభంపై కడతానని 80 అడుగుల ఎత్తులో ఉన్న ధ్వజస్తంభంపై కి ఎక్కాడు. ఆ సమయంలో తాను తీసుకుపోయిన తాడు జారి కింద పడిపోయింది. దీంతో నరసింహారావు తాను కట్టుకున్న పంచెను చింపి దానిని తాడుగా చేసి జెండా కట్టి ధ్వజస్తంభంపై ఎగరవేశారు. ఈ విధంగా నరసింహారావు ముష్టికుంట్ల ప్రజలలో కమ్యూనిస్టు భావజాలాన్ని నింపాడు. అనంతరం నరసింహారావు ఆంధ్ర ప్రాంతం వెళ్లారు. కొంతకాలం తర్వాత ఆంధ్ర ప్రాంతంలో ఆయనను కాల్చి చంపారు. 1947 తర్వాత ఆ ఏడుగురిని జైలు నుంచి విడుదల చేశారు. 1952 లో జరిగిన ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు చల్ది వీరస్వామి ఆ గ్రామ సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1964లో కమ్యూనిస్టు పార్టీలో చీలిక అనంతరం అందరూ సీపీఐ(ఎం)లో చేరారు. కమ్యూనిస్టు పార్టీ చీలిక అనంతరం బోడేపూడి వెంకటేశ్వరరావు చిర్రావూరి లక్ష్మీనరసయ్య మంచికంటి రామ్ కిషన్ రావు గ్రామంలో మూడు నాలుగు రోజుల పాటు ఉండి కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం చేశారు. గ్రామంలో 1952 నుంచి 2020 వరకు అన్ని పదవులను సీపీఐ(ఎం)కు చెందినవారే ఎన్నికవుతూ వచ్చారు. ముష్టికుంట్ల శివారు గ్రామాలైన నాగులవంచ, చొప్పకట్లపాలెం పాతర్ల పాడు, చిరునోముల, రామాపురం తదితర గ్రామాలలో పంచాయతీల నిర్వహణ కోసం సీపీఐ(ఎం) నాయకులు వెళ్లేవారు. ఆ విధంగా వారి ప్రభావం ఆ గ్రామాలలో కూడా పడింది. ఎన్నికల సమయంలో పందిళ్లపల్లి వరకు వెళ్లి ప్రచార నిర్వహించేవారు. ముష్టికుంట్లలో పార్టీ సమావేశాలు పార్టీ నాయకులు ఇళ్లల్లో నిర్వహిస్తుండటంతో కొన్ని సమస్యలు తలెత్తాయి. దీంతో 1994లో గ్రామంలో 24 వేల రూపాయలతో ఓ ఇంటిని కొనుగోలు చేశారు. 2000 వరకు ఆ ఇంటిలోనే పార్టీ సమావేశాలు నిర్వహించారు. అయితే ఆ ఇల్లు కూడా శిధిలావస్థకు చేరుకుంది. దీంతో పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో పార్టీ కార్యాలయం నిర్మించాలని ఆలోచనకి వచ్చింది. ఆ సమస్యల నుంచే సిపిఎం కార్యాలయం నిర్మాణం ఆలోచన పుట్టింది. దీంతో 6 జూన్ 2000 ఆనాటి సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం శంకుస్థాపన చేశారు. 28 మే 2001 న ఆనాటి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బి.వి.రాఘవులు సిపిఎం కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆ రోజు నుంచి నేటి వరకు సిపిఎం కార్యాలయం అనేక పోరాటాలకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిలయంగా మారింది. 21 సంవత్సరాల తర్వాత మరలా పార్టీ కార్యాలయానికి మే డే సందర్భంగా రంగులు వేస్తున్నారు. మే డే వేడుకలను గ్రామంలో ఘనంగా నిర్వహించేందుకు పార్టీ కార్యాలయాన్ని మే డే వేడుకలకు ముస్తాబు చేస్తున్నారు. సీపీఐ(ఎం) కార్యాలయం వద్ద వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులు దొడ్డి కొమరయ్య చిత్రాన్ని టీఎస్ యుటిఎఫ్ మాజీ నాయకుడు పిల్లలమర్రి వెంకట అప్పారావు వేస్తున్నారు మే డే వేడుకలకు గ్రామం మొత్తం సిపిఎం తోరణాలతో ఎరుపుమయం చేసేందుకు ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు రంగంలోకి దిగారు.