Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలో అధికార పార్టీకో న్యాయం ప్రతిపక్షాలకు న్యాయమా అని కాంగ్రెస్ నగర అధ్యక్షులు జావిద్ ప్రశ్నించారు. మంగళవారం ఖమ్మంకు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి రావడంతో నగరంలోని అన్ని కూడళ్లలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో మున్సిపల్ అధికారులు కాంగ్రెస్ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఉదయం కొన్ని ప్రాంతాల్లో తొలగించగా వైరా రోడ్డు లోని ఫ్లెక్సీలను తొలగిస్తుండగా విషయం తెలుసుకున్న నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని ఫ్లెక్సీలు తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బంది అడ్డుకున్నారు. ఎందుకు తొలగిస్తున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో వారు అధికారుల ఆదేశాల మేరకు తొలగిస్తున్నామని తెలపడంతో నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా గా మున్సిపల్ డీఆర్ఎఫ్ వాహనాన్ని ఆపి వాహనంలో ఉన్న సిబ్బందిని బయటికి లాగి వాహనాలను ధ్వంసం చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఎంతకి వినకుండా రెండు గంటల పాటు వైరా రోడ్డులో రాస్తారోకో నిర్వహించారు. చివరకి పోలీసులు ఫ్లెక్సీలను తొలగించమని చెప్పడంతో ర్యాలీగా కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్నారు. తొలుత కాంగ్రెస్ నగర అధ్యక్షుడు జావిద్ మాట్లాడుతూ రాష్ట్రంలోని అరాచక పాలన నడుస్తుందని అధికార పార్టీకి సంబంధించిన మంత్రులు గాని ఇతర నాయకులు వస్తే వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ఎన్ని రోజులైనా తొలగించారు గాని తమ పార్టీ నాయకులు వస్తున్నారని రెండు గంటల ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేసుకుంటే వాటిని ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అధికార పార్టీకి న్యాయం ఇతర పార్టీలకు మరో న్యాయమా అని అన్నారు. ఇప్పటికైనా అధికారులు అధికార పార్టీ వత్తాసు పలకుండా అందర్నీ సమానంగా చూడాలని అని అలా కాకుండా అధికార పార్టీని ఒక విధంగా ప్రతిపక్ష పార్టీలు మరో విధంగా చూడడం ఏంటి అని ప్రశ్నించారు. ఖమ్మంలో మంత్రి అజరు కుమార్ ఆదేశాలతోనే అధికారులు ఈ విధంగా చేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు దుద్దుకూరు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులు నాయక్ కుమార్, నాయకులు బాణాల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.