Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విభజనలో భద్రాద్రికి తీవ్ర అన్యాయం
- రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
నవతెలంగాణ-భద్రాచలం
భవిష్యత్తులో యాదాద్రి తరహాలో భద్రాద్రి రామాలయాన్ని అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ కృత నిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాముని పేరుతో రాజకీయాలు చేసే బీజేపీ నేతలకు, కేంద్ర ప్రభుత్వానికి భద్రాచలంపై వివక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో భద్రాచలానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని ఆయన అన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా భద్రాచలం, భద్రాద్రి రామాలయం నిర్లక్ష్యానికి గురైందని ఆయన అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణలోని ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించి ఒక్కొక్క ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రానికే తలమాని కంగా యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్ అభివృద్ధి చేశారని ఆయన అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం శ్రీరాముడు నడయాడిన ప్రాంతమైన భద్రాచలం అభివృద్ధికి ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. భద్రాచలం రైల్వేలైన్ నిర్మించాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉందని, రామాలయాన్ని కూడా బ్రహ్మండంగా నిర్మించాల్సి ఉందని మంత్రి అన్నారు. ఆయన వెంట ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం వెంకట్రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, భద్రాచలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అరికెళ్ళ తిరుపతిరావు, భద్రాచలం గ్రంథాలయ శాఖ చైర్మన్ మామిడి పుల్లారావు, ఎం.డి.బషీర్ తదితరులు ఉన్నారు.
బాబు జగ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని మంత్రికి వినతి
భద్రాచలంలో బాబు జగ్జీవన్ రావ్ కమ్యూనిటీ హాలు నిర్మించాలని, దళిత బందులో అనర్హులను తొలగించాలని మంత్రి కొప్పుల ఈశ్వర్కి దళిత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దళిత సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు ముద్దా పిచ్చయ్య మాట్లాడుతూ పట్టణంలో దళితులు శుభకార్యాలు చేసుకోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అదేవిధంగా భద్రాచలం పట్టణంలో దళిత బంధు పథకంలో ఎంపిక చేసిన అర్హుల జాబితాపై మరల సమగ్ర విచారణ జరిపించి దళితుల్లో సంపన్న వర్గాలగా ఉన్న వారిని అనర్హులుగా తొలగించి, నిరుపేద దళితులకు దళిత బంధు పథకం అమలు చేయాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాదిగ దండోరా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్లు, దళిత సంక్షేమ సంఘం నాయకులు కోమ్మవరపు ప్రతాప్, రత్నం రమాకాంత్, బాంబోతుల రాజీవ్, బల్లా రాంబాబు , చింతాడ చిట్టి బాబు, మామిడి పుల్లారావు, బషీర్ తదితరులు పాల్గొన్నారు.