Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గిరిజన గ్రామాల్లో ఆదివాసీలకు
- గొంతెండుతున్నా స్పందించని అధికారులు
నవతెలంగాణ-పినపాక
ఏజెన్సీ గిరిజన గ్రామాల ప్రజలకు యేటా తాగునీటి తంటాలు తప్పడం లేదు. అసలే వేసవి కాలం కావడంతో ఆదివాసీల కష్టాలు వర్ణణాతీతం. మండుటెండల్లో గుక్కెడు నీటి కోసం పడరాని పాట్లు పడుతున్నారు. చెంబెడు నీటి కోసం చెట్లు, గుట్టలు వెంబడి పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తు తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా తాగునీటి పథకాలు నిర్మించిన గిరిజన గ్రామాలలో ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తప్పడం లేదు. ముదిరిన ఎండలతో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో బోరుబావుల్లో సైతం నీరు తగ్గిపోతోంది. ఫలితంగా గిరిజన గ్రామాల ప్రజలు మంచినీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం బోటి గూడెం గ్రామ పంచాయతీ, జానంపేట పంచాయతీలో కొత్తగుంపు, టీ కొత్తగూడెం ఉమేష్ చంద్ర నగర్ గ్రామపంచాయతీలలో గల గిరిజన గ్రామాలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానిక పంచాయతీ సిబ్బంది కూడా ట్రాక్టర్ ద్వారా కూడా మంచినీరు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బోటిగుడెం గ్రామపంచాయతీలో గిరిజన గ్రామాలకు నీరు అందిస్తామని 2500 లీటర్ల నీటిని ఏర్పాటు చేస్తామని చెప్పారు తప్ప ఏర్పాట్లు మాత్రం చేయడం లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న అంగన్వాడి స్కూల్ నుండి నీరు తెచ్చుకున్న బురద నీరు వస్తుందని అది తాగి బతుకుతున్నామని వారు తెలుపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని గిరిజనులు వేడుకుంటున్నారు.
మాకు తాగునీరు అందించండి
పూనేమ్ రమణ, బోటి గూడెం గ్రామం
నెలరోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. పంచాయతీ అధికారులకు చెప్పిన స్పందించడం లేదు. మాకు తాగడానికి అయినా మంచి నీరు ఇప్పించండి. మంచినీళ్లు కావాలంటే చాలా దూరం నడిచి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. కూలికి వెళ్లి ఇంటికి వచ్చి నీరు తాగుదాం అన్నా ఆ అవకాశం లేకుండా పోయింది.
గొంతెండుతోంది... దయ చూపండి
ఇర్ఫా సమ్మయ్య, బోతిగుడెం
తాగునీటి కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. పక్కనే ఉన్న బురద నీరు తెచ్చుకొని తాగుతున్నాను. గిరిజన గ్రామాలకు నీరు అందించక పోవడం చాలా బాధాకరం. పంచాయతీ ట్రాక్టర్ల ద్వారా ఆయన అధికారులు స్పందించి మంచినీరు అందించండి.
గిరిజన గ్రామాల పై ఎందుకింత చిన్నచూపు
సీపీఐ(ఎం) మండల కన్వీనర్ నిమ్మల వెంకన్న
గిరిజన గ్రామాలపై తెలంగాణ ప్రభుత్వం చిన్నచూపు చూపిస్తోంది. ఆదివాసి గ్రామాలకు మంచినీరు అందించడం లేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించకపోతే ఎంపీడీవో కార్యాలయం, ఐటీడీఏ కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం.