Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఓట్లు మావి... కోట్లు మీకా
- ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఈ ప్రాంతంలో నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన పెద్దవాగు ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోయిన పేదలకు నేటికి పరిహారం అందలేదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన సమన్వయ కర్త డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా 53వ రోజు యాత్రలో అశ్వారావుపేట మండలంలోని ఖమ్మం పాడు ఆదివాసి గిరిజనులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నాలుగు దశాబ్దాల కిందట పదహారు వేల ఎకరాల భూమికి సాగు నీరు, అశ్వారావుపేటలోని 17 గ్రామాలకు తాగునీరు అందించేందుకు తలపెట్టిన పెద్దవాగు ప్రాజెక్టు వల్ల భూమి కోల్పోయిన బాధితులకు సంపూర్ణ న్యాయం జరగలేదని ఆవేదన చెందారు. ఖమ్మంపాడులో వలస గిరిజనులకు పునరావాసం కల్పించిన ప్రభుత్వం తిరిగి ఇపుడు పేదల నుండి భూములు గుంజు కుంటుందని, అటవీ అధికారులు సాయంతో దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని అక్కడ గిరిజనులు ఆర్ఎస్పీకి విన్నవించుకున్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనులను ఆదుకుంటామని ప్రవీణ్ కుమార్ హామీ ఇచ్చారు. గిరిజనులే అసలైన అటవీ రక్షకులని తెలిపారు.
యువత బీఎస్పీ పార్టీలో చేరితే స్థానిక అధికార పార్టీకి చెందిన ఆధిపత్య కులాల నాయకులు బెదిరింపులకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారని, బీఎస్పీ పార్టీ అంటే అంత భయమెందుకని, బెదిరింపులకు, దాడులకు బీఎస్పీ కార్యకర్తలు భయపడరని రానున్న రోజుల్లో బహుజన రాజ్యం సాధిస్తామని ఖచ్చితంగా మీకు తగిన బుద్ది చెపుతామని హెచ్చరించారు. యాత్రలో భాగంగా వినాయకపురంలో ముత్యాలమ్మ గుడిని, పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయమును సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నారాయణపురం గ్రామంలోని చర్చిలో ప్రార్థనలో పాల్గొని దేవుని రాజ్యం సాధించేందుకే ఈ యాత్ర చేస్తున్నామని అందుకే అందరూ ఏనుగు గుర్తుకు ఓటేయాలని కోరారు. అశ్వారావుపేట నియోజకవర్గంలో 45 వేల మందికి కనీసం ఇళ్లు లేవని వాపోయారు. వేల కోట్లతో తలపెట్టిన మిషన్ భగీరథ నీరు గ్రామాల్లోని ప్రజలు దాహాన్ని తీర్చడంలేదన్నారు. ఆసుపాక గ్రామంలో వీఆర్ఏతో ముచ్చటించారు. తదనంతరం బచ్చువారిగూడెంలో కొమురంభీమ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కొమురంభీమ్ ఆశయాలను బీఎస్పీ పార్టీ నెరవేరుస్తుందని తెలిపారు.