Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ రహదారికి అదనంగా భూములు తీసుకున్నారంటూ...
- గోకినేపల్లిలో రైతుల ఆందోళన
నవతెలంగాణ- ముదిగొండ
సూర్యాపేట జిల్లా కోదాడ నుండి మహబూబాద్ జిల్లా కొరివి వరకు కేంద్ర ప్రభుత్వ నిధులతో జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మండల పరిధిలో గోకినేపల్లి గ్రామ రైతుల భూముల నుండి జాతీయ రహదారి నిర్మాణాన్ని పవర్ టెక్ సంస్థ చేపట్టింది. రహదారి నిర్మాణానికి కావలసిన భూమిని ముందుగానే తీసుకొని రైతులకు నష్టపరిహారం ప్రభుత్వము చెల్లించింది. రహదారి నిర్మాణానికి ముందుగా తీసుకున్న భూమి కంటే అదనంగా భూమిని తీసుకుంటున్నారంటూ గోకినేపల్లి గ్రామ రైతులు తమ భూముల వద్ద ఆదివారం ఆందోళనతో నిరసన వ్యక్తం చేశారు. దీంతో కంపెనీ వారు నిర్మాణాన్ని నిలిపివేశారు. ఈసందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల క్రితం రహదారి కావాల్సిన భూముల సర్వే నిర్వహించారన్నారు. రహదారికి సరిపోను భూమిని రైతుల నుండి కుంట నుండి 15 గంటల వరకు సేకరించి ప్రభుత్వం వారికి నష్టపరిహారం చెల్లించిందన్నారు. రైతుల వద్ద నుండి ముందుగా తీసుకున్న భూమి కంటే ప్రస్తుతం రహదారి నిర్మాణంలో అదనంగా భూమిని తీసుకునేందుకు కొలతలు నిర్వహించారన్నారు. రైతు అనుమతి లేకుండా రహదారి నిర్మాణం చేయడం సమంజసం కాదన్నారు. తమ భూమిలో గతంలో 9 కుంటల భూమికి నష్టపరిహారం చెల్లించి ప్రస్తుతం 36 గుంటల భూమికు రహదారి నిర్మాణానికి కొలతలు వేయటం అన్యాయమన్నారు. జాతీయ రహదారి నిర్మాణానికి తమ భూములు అదనంగా కోల్పోవాల్సివస్తుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రేటు ప్రకారం అదనపు భూమికి నష్టపరిహారం చెల్లించి హైవే నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈప్రాంతంలో 15 మంది రైతులు తమ భూములను అదనంగా కోల్పోవాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.హైవే నిర్మాణానికి రైతుల నుండి తీసుకున్న భూమితోపాటు మిగిలిన భూమిని కూడా ''నాలలో'' పెట్టడంవల్ల ప్రభుత్వ పథకాలు లబ్ది రైతులు కోల్పోతున్నరన్నారు. ధరణి పోర్టల్లో ''నాలా'' నుండి తీసివేసి, పహాని, వన్ బిలో మిగిలిన భూములు తమకు వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో తాసిల్దార్, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి అనేక వినతిపత్రాలు అందజేసి తమకు న్యాయం చేయాలని చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రైతులు పయ్యావుల రామనాథం, పయ్యావుల వెంకటేశ్వరరావు, కృష్ణసాగరపు సత్యం, ధనియాకుల లింగయ్య, సాకిిి రామారావు, గుండెపుడి శ్రీనివాసశర్మ, ధనియాలు వెంకటేశ్వర్లు, పొదిలి కన్నయ్య, ఉపేందర్, పాపారావు తదితరులు పాల్గొన్నారు.