Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
మేజర్ గ్రామ పంచాయతీలలో పెండింగ్ అభివృద్ధి పనులన్నింటినీ సత్వరమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెద్దతండా, ఏదులాపురం, పాలేరు, పండితాపురం, చిన్న మండవ పంచాయతీలలో అభివద్ధి పనులు, సంతల నిర్వహణ, పన్ను వసూళ్లుపై మంగళవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఇన్చార్జ్ జిల్లా పంచాయతీ అధికారి వి.అప్పారావుతో కలిసి సమీక్షించారు. పాలేరు, పండితాపురం సంతలలో మెరుగైన సదుపాయాలు కల్పించాలన్నారు. వ్యాపారులు, కొనుగోలు దారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడలని పంచాయతీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మౌళిక వసతుల కల్పనలో భాగంగా తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్ దీపాలు వంటి సౌకర్యాలను మెరుగుపర్చి సంతలు పరిశుభ్రంగా నిర్వహించాలన్నారు. దీనితో పాటు గ్రామాభివద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో ఆదాయ వనరులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. గ్రామాల్లో కట్టడాల అనుమతులు, పన్నుల వసూళ్ళను నూరు శాతం సాధించాలని కలెక్టర్ తెలిపారు. పరిశుభ్రతలో భాగంగా సి.సి. రోడ్స్, డ్రైనేజ్ వ్యవస్థను పటిష్ట పరచాలన్నారు. అవసరం మేరకు ఆటోలు, స్ట్రీట్ లైట్లు, జనాభా ప్రాతిపదికన పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. రోడ్లకిరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ చేపట్టాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు ప్రతి గ్రామంలో జరిగే పనులను పర్యవేక్షించాలన్నారు. గ్రామాల్లో చదువుకున్న యువతకు పోటీ పరీక్షల సన్నద్ధతకు గ్రంథాలయాలను ఏర్పాటు చేయాలన్నారు. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్ తెలిపారు. మండల ప్రత్యేక అధికారులు, శ్రీనివాసరెడ్డి, అశోక్, కరుణాకర్ రెడ్డి, షేక్ శిలార్ సాహేబ్, శ్రీనివాసరావు, మండల అభివద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, కార్యదర్శులు, గ్రామ సర్పంచ్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.