Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు
- అర్హులకి రేషన్ కార్డులు, ఇండ్లు, ఇండ్ల స్థలాలు ఇవ్వాలి
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
ఖమ్మం నగరంలో క్షేత్ర స్థాయిలో వున్న ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో టిఆర్ఎస్ పాలకవర్గం విఫలం అయిందని రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయూ, ఐద్వా, డివైఎఫ్ఐ, ప్రజా సంఘాల ఖమ్మం అర్బన్ కమిటీ ఆధ్వర్యంలో నూతన కార్పొరేషన్ కార్యాలయం ముందు 2వ రోజు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ.. శివారు ప్రాంతాలను కార్పొరేషన్ లో విలీనం చేయడం ఫలితంగా ప్రజలపై పన్నుల భారం ఎక్కువ వేసి పనులు మాత్రం తక్కువగా చేస్తున్నారు అని ఆరోపించారు. నగరంలో కూడా ఒక్క ప్రాంతం చుట్టూ మాత్రమే అభివృద్ధి జరుగుతుందని, కీలకమైన శివారు ప్రాంతాల్లో అభివృద్ధిని పట్టించుకోవడం లేదు అన్నారు. మెయిన్ రోడ్ లపై లైట్లు పెడితే సరిపోదని శివారు ప్రాంతాల్లో లైట్ లు కూడా లేవు అని విమర్శించారు. వరుసగా ఐదు రోజులు పాటు కార్పొరేషన్ కార్యాలయం ముందు ధర్నాల ద్వారా ప్రజా సమస్యలను టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళుతున్నామని సమస్యలు పరిష్కారం కాకపోతే కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు ఎర్రా శ్రీకాంత్, సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు వై.విక్రమ్, ప్రజా సంఘాల నాయకులు ఎం.భారతి, నవీన్ రెడ్డి, బత్తిని ఉపేంద్రర్, పి నాగేశ్వరరావు, నాగమణి, వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.