Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
అభయహస్తం పథకం కింద నగదు జమ చేసిన మహిళలకు ఆ డబ్బు వడ్డీతో సహా తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో ముదిగొండ స్త్రీశక్తి కార్యాలయం వద్ద మంగళవారం భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా మండల అధ్యక్షకార్యదర్శి మందరపు పద్మ, పయ్యావుల ప్రభావతి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో అభయహస్తం పథకం కింద మహిళలందరూ నగదు జమ చేశారన్నారు. 60 సంవత్సరాలు దాటితే మహిళలకు పెన్షన్ కూడా ఇస్తానని ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వం అభయహస్తం పథకం కింద జమ చేసిన నగదును తిరిగి మహిళలకు వడ్డీతో సహా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. 60 సంవత్సరాలు దాటిన మహిళలకు పెన్షన్ మంజూరు చేయాలన్నారు. తెరాస ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలైనా అభయహస్తం పథకం డబ్బులు మహిళలకు ఇవ్వకపోవడం శోచనీయమన్నారు. వెంటనే అభయహస్తం పధకం నగదు మహిళలకు ఖాతాల్లో జమ చేయాలన్నారు. లేకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. అనంతరం ఐకెపి ఎపిఎం గంగుల చిన్నవెంకటేశ్వర్లుకు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరుమర్రి ఎంపీటీసీ సభ్యురాలు, ఐద్వా మండల నాయకురాళ్లు కోలేటి అరుణ, వినుకొండ రాణి, కమర్తపు మంగమ్మ, షేక్ బేగం, షేక్ ఖాదరబి, మొక్క జయమ్మ, మల్లారపు నాగమణి, ఉపేందరమ్మ, మల్లెల సత్యవతి, గంగుల పుల్లమ్మ, సులోచన, దిగుట్ల పద్మ పాల్గొన్నారు.