Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్టుబడిలో 25 శాతం మాత్రమే దిగుబడి
- లబోదిబోమంటున్న అన్నదాతలు
నవతెలంగాణ -బోనకల్
ఈ ఏడాది మామిడి రైతులు నల్ల నల్లతో నిండా మునిగి పోయారు. చాలా మంది రైతులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని మామిడిపూత పడకముందే తోటలను లక్షలాది రూపాయలతో కొనుగోలు చేశారు. మండలంలో 212 మంది రైతులకు చెందిన 500 ఎకరాల లో మామిడి తోటలు ఉన్నాయి. ఈ మామిడితోటలు సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్ చివరి నాటికి పూత పడి పిందెలుగా మారుతుంటాయి. అయితే ఏ మామిడి తోటల్లోనూ సగం పూత కూడా పడలేదు. పడిన పిందే కూడా నల్ల నల్లి తో రాలిపోయింది. దీంతో అన్నదాతలు లక్షలాది రూపాయలతో ముందుగానే మామిడితోటలు కొనుగోలు చేసి వేల రూపాయలతో మందులు కొట్టారు. అయినా పూత, పిందె నిలవలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందారు. మామిడి తోటలపై ఆశలు వదులుకున్న అన్నదాతలు ఈ సంవత్సరం అప్పులపాలై నట్లేనని నిరాశ నిస్పహలకు లోనై ఉన్నారు. జనవరి, ఫిబ్రవరి నెలలో మరల రైతుల లో మామిడి తోటలు ఆశలను రేకెత్తించాయి. ఈ రెండు మాసాల్లోనే అన్ని మామిడి తోటలో పెద్ద ఎత్తున పూత ప్రారంభమైంది. దీంతో అన్నదాత లో మరల ఆశలు ప్రారంభమయ్యాయి. పూతను కాపాడుకునేందుకు మరల మందులు పిచికారి చేశారు. పూత మొత్తం దాదాపు పిందెగా మారింది. అయితే పడిన పిందెలు దాదాపు 70 నుంచి 80 శాతం వరకు నల్ల నల్లి ప్రభావంతో రాలిపోయింది. దీంతో రైతులకు ఒక్కసారిగా తీవ్ర నిరాశ లకు మామిడి తోటలు గురిచేశాయి. పిందె పడటంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ నుంచి మామిడి వ్యాపారులు కూడా మామిడి తోట వ్యాపారులకు పెట్టుబడులు పెట్టారు. కానీ పెట్టిన పెట్టుబడి లో కనీసం 30 నుంచి 40 శాతం కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిరునోముల నుంచి పెద్ద ఎత్తున మామిడికాయలు హైదరాబాద్, ముంబై ఎగుమతి చేస్తారు. తోటలు నల్ల నల్లితో కుదేలు అయ్యాయి.
రూ.11 లక్షలతో 25 ఎకరాలు కొనుగోలు చేశాం : ముంగి వెంకన్న, రైతు, చిరునోముల
చిరునోముల గ్రామంతో పాటు జిల్లాలో పలు ప్రాంతాలలో 11 లక్షల రూపాయలతో 25 ఎకరాలను కొనుగోలు చేసాము. ఇందులో ఏడున్నర లక్షల రూపాయలతో మామిడి తోటలను కొనుగోలు చేసాము. ఇందుకుగాను మూడు లక్షల 50 వేల రూపాయలతో భూమి మందు వేసి, పై మందు పిచికారి చేశాము. 25 ఎకరాల నుంచి మూడున్నర టన్నుల మామిడి కాయలను హైదరాబాదులో విక్రయించామని తెలిపారు. టన్ను నలభై ఐదు వేల రూపాయల చొప్పున లక్షా 50 వేల రూపాయలు ఆదాయం వచ్చింది. మొత్తం మీద మరో నాలుగు టన్నులు దిగుబడి వస్తుంది. మొత్తం మీద 3 నుంచి 4 లక్షల ఆదాయం వస్తుందని తెలిపాడు. 11 లక్షలు పెట్టుబడి పెడితే మూడు నుంచి నాలుగు లక్షలు మాత్రమే ఆదాయం వచ్చిందన్నారు. మిగిలిన ఏడు లక్షల రూపాయలు నష్టం దాదాపు వచ్చినట్లే అని తెలిపాడు.