Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గర్భిణుల 108 వాహనంలో
- ప్రయివేటుకు తరలిస్తే చర్యలు
- జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
జిల్లాలో (పాలియేటివేర్) ఉపశమన సంరక్షణ ప్రభుత్వ వైద్యసేవలను మరింత మెరుగుపర్చాలని కలెక్టర్ వి.పి.గౌతమ్ వైద్యాధికారులను ఆదేశించారు. తన ఛాంబర్ లో వైద్యాధికారులతో కలెక్టర్ మంగళవారం సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలను పెంచాలన్నారు. రోజుకు కనీసం రెండు, మూడు శస్త్ర చికిత్సలు చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అందించే వైద్య సేవల ద్వారానే ప్రజలకు నమ్మకం ఏర్పడుతుందన్నారు. ఆరోగ్యశ్రీ కింద జిల్లా ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేయాలని కలెక్టర్ సూచించారు. 108 సేవల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్య మరింత పెరగాలని, గర్భీణులను 108 వాహనాల ద్వారా ప్రయివేటు ఆసుపత్రులకు తరలించే వాహనాల బాధ్యులు, డ్రైవర్లపై తగు చర్యలు తీసుకోవాలని 108 కో-ఆర్డినేటర్ ను కలెక్టర్ ఆదేశించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుండి తరలించే ప్రసవాల కేసులన్నీ నేరుగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రికి 108 వాహనాల ద్వారా రావాలని కలెక్టర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో వైద్యాధికారులు సమయపాలన పాటించాలన్నారు. ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలన్నారు. పాలియే టీవేర్ వైద్యానికి జిల్లా ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాధిగ్రస్తులకు ఉపశమన సంరక్షణ వైద్యసేవలను అందిస్తూ మానసిక ఒత్తిడులకు లోనుకాకుండా రోగులకు వైద్యసేవలతో పాటు మనోధైర్యాన్ని కల్పించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మాలతీ, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా బి.వెంకటేశ్వర్లు, ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ శ్రీనివాస్, వైద్యాధికారులు డా.స్వప్న, డా.కోటి రత్నం, 108 కో-ఆర్డినేటర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.