Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియూ జిల్లా నాయకులు వై.విక్రమ్
- కార్పొరేషన్ ఎదుట ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణ- ఖమ్మం
ఖమ్మం నియోజకవర్గంలో ప్రజలకు కావాలసిన మౌలిక సౌకర్యాలు కల్పించకపోతే టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రజల ఆగ్రహానికి గురి కాకతప్పదని సిఐటియూ జిల్లా నాయకులు వై.విక్రమ్ హెచ్చరించారు. గురువారం ఖమ్మంలోని సిఐటియూ, ఐద్వా, డివైఎఫ్ఐ, కెవిపిఎస్, ఆవాజ్, ఎన్పీఆర్డీ, ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూం ఇళ్ళు, పెన్షన్లు, రేషన్ కార్డులు తదితర స్ధానిక సమస్యలు పరిష్కారం చేయడంలో టిఆర్ఎస్ పాలకవర్గం విఫలమైందని విమర్శించారు. రోడ్ మీద నాలుగు పూలు కుండీలు పెట్టి ఖమ్మం అభివృద్ధి అయిందని టిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు ప్రకటనలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా గోడల మీద బొమ్మలు వేస్తే ప్రజల కడుపు నిండదని విమర్శించారు. మామిళ్ళగూడెం సారధి నగర్ అండర్ బ్రిడ్జి సమస్య పరిష్కారం చేయడంలో జిల్లా మంత్రి పువ్వాడ అజరుకుమార్ విఫలం చెందారని విమర్శించారు. డిపో రోడ్, ఎన్ఎస్టి రోడ్ వెడల్పుకు నిధులు మంజూరు చేయకుండా, నగరంలో ఒకే ఒక్క ప్రాంతంలో చుట్టూ అభివృద్ధి చేస్తున్నారని విమర్శించారు. రమణగుట్ట, రాపర్తి నగర్ ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీ లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. వెంటనే ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోతే త్వరలో కార్పొరేషన్ కార్యాలయం ముట్టడి చేస్తామని అక్కడే వంట వార్పూ పెడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు బోడపట్ల సుదర్శన్, ఎన్. మనోహర్, ఎస్.కె మీరా సాహిబ్, ఎంఏ జబ్బార్, ఆర్.ప్రకాష్, డి.తిరుపతిరావు, యస్.నవీన్ రెడ్డి, భుక్యా ఉపేంద్ర, ఎండీ గౌస్, సిహెచ్ భద్రం, రమేష్, డి.నాగరాజు, హుస్సేన్, ఎన్.కుమారి, పావని, బీబీ, బుర్రి శోభా, సాగర్, యేటా రాజేష్, కె రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.