Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బండి రమేష్
నవతెలంగాణ-ముదిగొండ
పెద్దమండవ గ్రామ అభివృద్ధికి ఎంతో కృషి చేసి ప్రజా నేతగా ఎదిగిన నిబద్ధత కలిగిన నాయకులు అభివృద్ధి ప్రదాత సిపిఎం నాయకులు అమరజీవి తాళ్లూరి వైకుంఠమని సిపిఐ (ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్ అన్నారు. మండల పరిధిలో పెద్దమండవ గ్రామంలో సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో వైకుంఠం18వ వర్ధంతి సభ గురువారం ఆ గ్రామశాఖ కార్యదర్శి మాదారపు శ్రీనివాసరావు అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైకుంఠం గ్రామంలో సిపిఎం అభివృద్ధికి బాటలు వేస్తూ ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేశారన్నారు. భూస్వామ్య పెత్తందార్ల దౌర్జన్యం నుండి పేద ప్రజలను కాపాడి వారికి అండగా నిలిచారన్నారు. బడుగు బలహీన పేద వర్గాలకు, ఎర్రజెండా నీడలో ఇంటి స్థలాలతో పాటు ఇండ్ల నిర్మాణం, రోడ్ల, మంచినీటి సౌకర్యాన్ని కల్పించి పేదల పక్షపాతిగా గ్రామ స్ఫూర్తి ప్రదాతగా ఆదర్శవంతమైన కమ్యూనిస్టుగా జననేతగా జనం గుండెల్లో నేటికి గుర్తుండి పోయారన్నారు. వైకుంఠం మరణించి దశాబ్దంన్నర దాటినా గ్రామ ప్రజలు ఆయనను మర్చిపోకపోవటం విశేషమన్నారు. వైకుంఠం స్పూర్తితో భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలకు పదును పెట్టాలన్నారు. తొలుత గ్రామంలో ఆరు సెంటర్లలో దిమ్మెల వద్ద ఎర్రజెండాలను ఎగరవేశారు. అనంతరం వైకుంఠం స్తూపం వద్ద పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎం) జిల్లా నాయకులు రాయల వెంకటేశ్వర్లు, వాసిరెడ్డి వరప్రసాద్, బండి పద్మ, మండల కార్యదర్శి బట్టు పురుషోత్తం, నాయకులు మందరపు వెంకన్న, రాయల శ్రీనివాసరావు, కందిమల్ల తిరుపతి, కుక్కల ముత్తయ్య, యడ్లపల్లి నరసింహారావు, సింగు సుబ్బారావు, తోటకూరి బసవయ్య తదితరులు పాల్గొన్నారు.