Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-బూర్గంపాడు
పెద్దల సమక్షంలో వివాహం చేసుకుని అదనపు కట్నం తేవాలని మానసికంగా వేధిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత సారపాకలోగల ఐటీసీ గేటు వద్ద గురువారం ఆందోళన చేపట్టింది. ఇందుకు సంబంధించి ఆ వివాహిత తెలిపిన వివరాల ప్రకారం... సారపాక లోని ఐటీసీ కర్మాగారంలో కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న నాగేంద్రకుమార్ తనను పెద్దల సమక్షంలో జనవరిలో ద్వితీయ వివాహం చేసుకున్నాడని తెలిపింది. కొద్దిరోజులు భద్రాచలంలోనే తన ఇంట్లో ఇద్దరం కలిసి కాపురం ఉన్నామని తెలిపారు. ఇటీవల అదనపు కట్నం కోసం నాగేంద్రకుమార్ వేధిస్తున్నాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తన పుట్టిల్లు నాగుల వంచలోని ఆస్తి తన పేరు మీద రాయాలంటూ బెదిరించాడనిఆమె పేర్కోంది. తనకు న్యాయం చేయాలని కోరుతూ బాధిత వివాహిత బుధవారం భద్రాచలంలో భర్త ఇంటి ఎదుట ఆందోళనకు సైతం దిగారు. సరైన న్యాయం జరగకపోవడంతో గురువారం సారపాకలోని ఐటీసీ గేటు వద్ద ఆందోళనకు దిగినట్లు తెలిపారు. తనకు న్యాయం జరిగేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని తేల్చిచెప్పారు. అధికారులు స్పందించి తనకు తగిన న్యాయం చేయాలని కోరారు. పెళ్లి నాటి ఫోటోలను సైతం చూపుతూ ఆందోళనను కొనసాగించారు. అంతేకాకుండా తన ముందే మరో పెళ్లి కోసం సంబంధాలు వెతుకుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సమాచారం అందుకున్న బూర్గంపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధిత మహిళ నుంచి వివరాలు సేకరించారు. ఆందోళన చేస్తున్న బాధిత మహిళకు నచ్చచెప్పి పోలీసుస్టేషన్ కు తీసుకువెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి పంపినట్లు తెలిసింది.