Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పురుగులమందు తాగి యువరైతుఆత్మహత్య
- రైతు కుటుంబాన్ని ఆదుకోవాలి : అఖిల పక్షం
నవతెలంగాణ-కారేపల్లి
నేలతల్లిని నమ్ముకొని సాగుచేసిన రైతును చీడపీడలు, ప్రకృతి వైపరీత్యాలు చుట్టిముట్టి చావే శరణ్యంగా మార్చుతున్నాయి. సాగు కలిసిరాక పోతుందా అనే ఆశతో వ్యవసాయం చేసిన యువరైతు అప్పులు ఊబిలో చిక్కుకొని ఈనెల 8వ తేదిన పురుగుమందు సేవించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిన ఘటన కారేపల్లి మండలం ఎర్రబోడులో చోటుచేసుకుంది. దీనికి సంబంధి ంచి గ్రామస్తులు కుటుంబ సభ్యులు తెల్పిన వివరాలు ప్రకారం...ఎర్రబోడు గ్రామానికి చెందిన చిట్టిన్ని నాగేశ్వర రావు(30) వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నాడు. తనకు ఉన్న రెండెకరాలతో పాటు మరో 4 ఎకరాలు కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నారు. వీటిలో రెండు ఎకరాల్లో మిర్చి, నాల్గు ఎకరాల్లో పత్తి పంట వేస్తున్నాడు. రెండేళ్లుగా సాగు కలిసి రావటం లేదు. పంటకు చేసిన పెట్టుబడి రూ.5 లక్షలకు చేరింది. దీనికి తోడు బ్యాంకులో రూ.లక్ష పైగా అప్పు ఉంది. ఆ అప్పు రెన్యూవల్ చేసుకోవాలని బ్యాంకర్లు ఒత్తిడి చేస్తున్నారు. రెన్యూవల్ చేసుకుందామంటే రైతు పేరున రెవిన్యూ రికార్డులలో కాస్తులో భూమి ఉంది తప్ప, పట్టా భూమి లేకుండా పోయింది. పంట దిగుబడిలేక పోవటంతో అప్పులు తీర్చలేక దిగులు పడుతున్నాడు. అప్పులను ఎలా తీర్చాలనే విషయాన్ని కుటుంబ సభ్యులతో చర్చిస్తూ మదనపడేవాడు. ఈనెల 8వ తేదిన మనస్తాపంతో పురుగుమందు తాగి ఇంట్లో వాంతులు చేసుకుంటుండగా భార్య చిట్టిన్ని కళ్యాణి గమనించి కుటుంబ సభ్యులకు తెల్పింది. వెంటనే నాగేశ్వరరావు ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తుండగా పరిస్ధితి విషమించి శుక్రవారం మృతి చెందాడు.
బేల చూపులతో చిన్నారులు
యువరైతు నాగేశ్వరరావు రెక్కల కష్టంపైనే కుటుంబం ఆధారపడి ఉంది. పురుగుమందు తాగి తండ్రి మృతి చెందటంతో తల్లి స్పృహతప్పి ఉండటంతో తండ్రి మృతదేహం వద్ద ఇద్దరు చిన్నారులు బేలచూపులతో నిల్చోని ఉండటం అక్కడి వారిని కలిచి వేసింది. నాగేశ్వరరావుకు భార్య కళ్యాణి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. తండ్రి ఆత్మహత్యకు పాల్పడటంతో చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
యువరైతు కుటుంబాన్ని ఆదుకోవాలి
అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న యువరైతు చిట్టిన్ని నాగేశ్వరరావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) మండలకార్యదర్శి కే.నరేంద్ర, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు వజ్జా రామారావు, సర్పంచ్ కుర్సం సత్యనారాయణ, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు తోటకూరి రాంబాబు, బత్తుల శ్రీనివాసరావులు కోరారు. మృతదేహాన్ని సందర్శించి నివాళ్ళు ఆర్పించారు. నివాళ్లు ఆర్పించిన వారిలో ప్రముఖ న్యాయవాధి నర్సింగ్ శ్రీనివాసరావు, టీఆర్ఎస్ నాయకులు అడపా పుల్లారావు, దమ్మాలపాటి ప్రసాద్, కడియాల రాజు, నర్సింగ్ మాధవరావు, ఈదర కోటేశ్వరరావు, సీపీఎం నాయకులు కుర్సం శ్రీను, బొజెడ్ల గోవిందరావు, పూనెం బాబు, కుంజా వెంకన్న, కాంగ్రెస్ నాయకులు చాగంటి వెంకటేశ్వర్లు, బోజెడ్ల వెంకట్రావు తదితరులు ఉన్నారు.