Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికిపైగా అయినా దొంగల ఆచూకీ శూన్యం
- కొనసాగుతూనే ఉన్న మోటార్ల ధ్వంసం
నవతెలంగాణ - బోనకల్
వ్యవసాయ విద్యుత్ మోటార్ల ధ్వంసం కేసులు అటకెక్కినట్లేనా అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏడాది నుంచి విద్యుత్ వ్యవసాయ మోటార్ల ధ్వంసం నేటికి కొనసాగుతూనే ఉంది. కానీ నేటి వరకు దొంగల ఆచూకీ లభించకపోవటం పలు విమర్శలకు తావిస్తోంది. మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో గత ఏడాది నుంచి గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ విద్యుత్ మోటార్లను ధ్వంసం చేస్తూ వస్తున్నారు. బాధిత రైతులు సంఘటన జరిగినప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు. నేటి వరకు సుమారు 25 మంది రైతులకు సంబంధించి 25 మోటర్లు ధ్వంసం చేశారు. వ్యవసాయ బావుల వద్ద మోటార్లను ధ్వంసం చేయటం లేదా సమీప బావులు, కాలవల, వాగులలో పడేస్తున్నారు. ఆళ్లపాడు కే పరిమితమైందని భావిస్తున్న తరుణంలో ఇటీవల రామాపురం గ్రామం లో కూడా ఐదుగురు రైతులకు చెందిన విద్యుత్ మోటార్లను ధ్వంసం చేసి కొన్నింటిని బోనకల్ బ్రాంచ్ కెనాల్ లో పడేశారు. ప్రధానంగా ఆళ్లపాడు గ్రామం లోనే తరచూ విద్యుత్ వ్యవసాయ మాటల ధ్వంసం కొనసాగుతూ ఉండటం పట్ల అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు అన్నదాతలు అనేక సార్లు ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కటం లేదు. అన్నదాతలు నిఘా వేసిన సమయంలో మోటార్ల ధ్వంసం మాత్రం జరగడం లేదు. కొన్ని రోజుల పాటు ఆగి మరల విద్యుత్ మోటార్ల ధ్వంసం కొనసాగుతూనే ఉంది. విద్యుత్ మోటార్ల ధ్వంసం వల్ల తాము వేలాది రూపాయలు నష్ట పోవడమే కాక సక్రమముగా సాగునీరు అందక పంట దిగుబడి కూడా తగ్గుతుందని అన్నదాతలు తెలిపారు. వ్యవసాయ విద్యుత్ మోటార్లను రాజకీయ కక్షలతో ధ్వంసం చేస్తున్నారా లేక మరే ఇతర కారణం చేత ధ్వంసం చేస్తున్నారనే విషయం మాత్రం మిస్టరీగా ఉంది. సంఘటన జరిగిన సమయంలో పోలీసులు కూడా సమస్యను తీవ్రంగానే తీసుకుంటున్నారు. కానీ మోటార్ల ధ్వంసం వీరులను మాత్రం చేదించడం లో విఫలమవుతున్నారనే విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. విద్యుత్ మోటార్ల ధ్వంసం చివరకు పరాకాష్టకు చేరింది. ఏ సమయంలో ఎవరి మోటార్లను ధ్వంసం చేసి నీటి పాల్ చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి అన్నదాతలలో నెలకొని ఉంది. రైతుల ఆందోళనలు దృష్టిలో పెట్టుకొని పోలీసులు మోటార్ల ధ్వంసం వీరుల భరతం పట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.