Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వర్గాలుగా విడిపోయి మరీ భూకబ్జాదారులకు అండీ
- ఖమ్మంలో కార్పొరేటర్ల భర్తల విపరీత పోకడ
- ప్లాట్ల ధరలకు రెక్కలు... బయటపడుతున్న కబ్జా దుర్బుద్ధి
- 'డబుల్' రిజిస్ట్రేషన్లు, ఫేక్ డాక్యుమెంట్లతో నిత్యం గడిబిడి
- కమ్యూనిస్టుల పాలనలో కబ్జా చింత లేదంటున్న ప్రజలు
నవతెలంగాణ- ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు చిర్రావూరి లక్ష్మీనర్సయ్య వంటి ప్రముఖులు ఏలిన ఖమ్మం... నాడు సుఖశాంతులతో వర్ధిల్లింది. ప్రజల ధనమాన ప్రాణాలకు చింత ఉండేది కాదు. ఆస్తుల పరిరక్షణ గురించి ఏరోజూ చీకూచింతా లేదు. నాడు పట్టణంగా ఉన్న ఖమ్మం నేడు నగరంగా రూపాంతరం చెందింది. దానితో పాటే రియల్ మాఫియా విస్తరించింది. నాడు ప్రజల ఆస్తులకు ప్రభుత్వం రక్షణగా ఉండేది. నేడు 'కంచే చేను మేసిన' చందంగా పాలకులే ప్లాట్ల కబ్జాకు పూనుకుంటున్నారు. కార్పొరేషన్ స్టీరింగ్ చేబూనిన 'కారు' నేతలు ఆక్రమణదారులకు అండగా ఉంటూ సామాన్యుల చెరబడుతున్నారని జనం గగ్గోలు పెడుతున్నారు. ఒక్కో ప్లాట్‌ను డబుల్, అంతకుమించి రిజిస్ట్రేషన్లు చేయిస్తూ ఆక్రమణలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 'మంత్ర దండం' అండతోనే అధికారం మాటున దురాక్రమణల పర్వం కొనసాగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. నగరంలో ఇటీవలికాలంలో చోటుచేసుకుంటున్న కొన్ని ఉదంతాలు దీనికి ఉదాహరణలుగా ఉన్నాయి.
- నగరం నిద్రపోయింది లేదు...
ఏరోజు ఎక్కడ ఏ దురాక్రమణ జరుగుతుందో..! రియల్ మాఫియా ఎలా పడగ విప్పుతుందో..!! ఏ ప్లాట్‌ను కాజేస్తుందోనని నగర వాసులు భయంభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇక విలువైన ప్రాంతాల్లో ఖాళీ జాగాలున్న వారైతే ప్రశాంతంగా నిద్రపోయింది లేదు. ముఖ్యంగా టూటౌన్ ప్రాంతంలో నిత్యం ఏదో ఒకచోట గడిబిడి. ప్రతీ ఘటనకు భూ తగాదాలే కారణం. అదీ రమణగుట్ట మొదలు మమత ఆస్పత్రి వరకూ ఎక్కడైనా సరే ఇదే తంతు. పేదలు 50 గజాల లోపు స్థలంలో గుడిసెలు వేసుకుంటే...రాత్రికి రాత్రి వాటిని తొలగించే అధికారులు అదే ప్రాంతంలో ఉండే పెద్దల జోలికి మాత్రం వెళ్లరు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలు, వ్యవసాయం, చిరు వ్యాపారాలతో పైసాపైసా పోగేసుకుని మిగిలిన కొద్దిపాటి ఆదాయంతో పది పదిహేనేళ్ల క్రితం కొనుగోలు చేసిన ప్లాట్లు ఖాళీగా ఉన్నాయంటే కబ్జా కన్ను పడినట్లేనని బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
- డబుల్..అంతకుమించి రిజిస్ట్రేషన్లు...
నగరంలో డబుల్, అంతకుమించి రిజిస్ట్రేషన్లు ఉన్న ప్లాట్లు వందలాదిగా ఉన్నాయి. వీటిలో అత్యధికం అధికార పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల గుప్పిట్లోనే ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. ఖానాపురం హవేలీ సర్వే నంబర్ మూడులో కృష్ణుడి గుడి, దానికి కొద్ది దూరంలో ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో 200కు పైగా ప్లాట్లు డబుల్ రిజిస్ట్రేషన్ అయినట్లు తెలుస్తోంది. 4, 6, 7, 56 తదితర డివిజన్లలో ఇలా వందలాది ప్లాట్లు దురాక్రమణకు గురై డబుల్, అంతకుమించి రిజిస్ట్రేషన్లు చేశారని స్థానికులంటున్నారు. రఘునాథపాలెం డబుల్ బెడ్రూంల సమీపంలో శివాయిగూడెంకు చెందిన అధికార పార్టీ నేత ఒకరు చివరికి రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఆధారంగా కూడా ప్లాట్ల రిజిస్ట్రేషన్ చేయిస్తానంటూ రూ.2000 విలువ చేసే ప్లాట్లను రూ.5వేలకు పైగా విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే 50కి పైగా ప్లాట్లు విక్రయించినట్లు తెలుస్తోంది. ఇతగాడి వలలో పడి అప్పుసప్పూ తెచ్చి ప్లాట్లు కొన్న అనేక మంది పేదలు న్యాయం చేయాల్సిందిగా గగ్గోలు పెడుతున్నారు.
- అధికారపార్టీలో 'విద్యానగర్' దురాక్రమణ దుర్బుద్ధి!
ఖానాపురం హవేలీ రెవెన్యూ పరిధిలోని ఖమ్మం బైపాస్‌రోడ్డు 56వ డివిజన్లో రెండురోజుల క్రితం చోటుచేసుకున్న ఉదంతం అధికారపార్టీలో చిచ్చుపెట్టిందనే చర్చ నడుస్తోంది. ఇక్కడి విద్యానగర్‌లో 1184 చదరపు గజాల స్థల వివాదం చినికి చినికి గాలివానగా మారింది. 303, 304 సర్వేనంబర్లలో దేనికి చెందినదో నిర్ధారించాల్సిన ఈ స్థలం విషయంలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్ల భర్తలు తలదూర్చినట్లు సమాచారం. రూ.3 కోట్లకు పైగా విలువ చేసే ఈ స్థలం తమదంటే తమదంటూ వర్గాలుగా విడిపోయి వైరానికి పాల్పడుతున్న దుమ్ముగూడెం మండలం పడమటి నర్సాపురం అని చెప్పుకుంటున్న రావులపల్లి రవికుమార్, స్థానిక పదో డివిజన్‌కు చెందిన బండి వెంకటేశ్వరరావులకు కార్పొరేటర్ల భర్తలు కొమ్ముకాస్తు న్నారని అంటున్నారు. ఈ గొడవ కాస్త చినికి చినికి గాలివానగా మారి మంత్రి పువ్వాడ అజరుకుమార్ దగ్గరకు వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఇరు వర్గాలను పిలిపించి చర్చించిన మంత్రి వీరిలో ఓ కార్పొరేటర్ భర్తను తీవ్రంగా మందలించినట్లు సమాచారం. అయితే ఆ కార్పొరేటర్ భర్త కూడా మంత్రికి దీటుగా సమాధానం ఇచ్చినట్లు చర్చ నడుస్తోంది. అవసరమైతే ఈ స్థలం వ్యవహారం కేటీఆర్, కేసీఆర్ వరకూ తీసుకెళ్తానని, ప్రాణాలు పోయినా సరే రాజీ పడేదే లేదని హెచ్చరించారని అంటున్నారు. పార్టీకి రాజీనామా అయినా చేస్తా కానీ, స్థలం విషయంలో నో కాంప్రమైజ్ అనే రీతిలో ఓ కార్పొరేటర్ భర్త వ్యవహారం ఉండగా...మరో కార్పొరేటర్ భర్త మాత్రం తెరవెనుక రాజకీయాలు నడిపిస్తున్నారని అంటున్నారు. ఇదిలావుంటే ఈ వివాదాస్పద స్థల వ్యవహారం ఎన్నో అడ్డదారులు తొక్కిందనే ఆరోపణలు న్నాయి. ఈ స్థలం తమదంటున్న బండి వెంకటేశ్వరరావు, ఆర్.రవికుమార్ పలు రకాల ఆధారాలు చూపిస్తున్నారు. 303 సర్వేనంబర్‌లోని స్థలమని రవికుమార్, 304వ నంబర్ అని వెంకటేశ్వరరావు వాదనలు వినిపిస్తున్నారు. ఈ క్రమంలో అనేక ఫేక్ డాక్యుమెంట్లు వెలుగుచూస్తు న్నాయి. 2001లో రిటైర్డ్ అయిన తహశీల్దార్ 2007లో పట్టా జారీ చేసినట్లు ఓ తప్పుడు ధ్రువీకరణతో పాటు ఈ స్థలానికి పూర్వ యజమానికిగా ఉన్న సయ్యద్ బాజీ చనిపోనప్పటికీ మరణధ్రువీకరణ పత్రం సృష్టించారని, కోటపాడుకు చెందిన రసూల్ కూతురు మైబూను బాజీ బిడ్డగా నమ్మిస్తున్నారని వెంకటేశ్వరరావు వాదిస్తున్నారు. లేదు 19-2-2010న బాజీ మరణించాడని, ఆయన కూతురు మైబు ద్వారా 6958/2021 పాస్‌బుక్ నంబర్‌తో తనకు ఈ స్థలం సంక్రమించిందని, 304 సర్వేనంబర్‌లో ఉన్న స్థల యజమాని అయిన వెంకటేశ్వరరావు భార్య బండి స్వర్ణశ్రీ 303 సర్వే నంబర్లో ఉన్న తన స్థలాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తోందని రవికుమార్ అంటున్నారు. దీనిలో నిజానిజాలు ఎలా ఉన్నా ఈ స్థల వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని యత్నిస్తున్న టీఆర్ఎస్ నేతల కబ్జా దుర్బుద్ది...' కారు'చిచ్చుకు దారితీసేలా ఉందని ఆ పార్టీ శ్రేణులే గుసగుసలాడటం గమనార్హం. కమ్యూనిస్టుల పాలనలో ఇటువంటివేవీ లేవని ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు.