Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ముదిగొండ
సూర్యాపేట జిల్లా కోదాడ నుండి మహబూబాబాద్ జిల్లా కురవి వరకు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ముదిగొండ ఊరు బయట నుండి వెళుతున్న ఈరహదారికి కావాల్సిన భూములను రైతుల నుండి కొలతల ప్రకారం తీసుకొని ప్రభుత్వం వారికి నష్ట పరిహారం చెల్లించింది. కాగా ముదిగొండ గ్రామానికి చెందిన యువ నిరుపేద రైతు భూక్య నగేష్ అనే వ్యక్తికి 15 గుంటల భూమి ఉన్నది. నగేష్ భూమి జాతీయ రహదారికి 11 కుంటల భూమికి మాత్రమే ప్రభుత్వము పరిహారం ఇచ్చింది. నగేష్ కు నాలుగు కుంటల భూమి రహదారి ఆనుకొని అదనంగా మిగిలింది. ఆ నాలుగు కుంటల భూమిని కూడా జాతీయ రహదారిలో కలుపుకొని రహదారి నిర్మాణాన్ని పవర్ టెక్ కంపెనీ చేపట్టింది. దీంతో ఆపేద రైతు నాలుగు కుంటల భూమి రహదారిలో అదనంగా తీసుకున్నారని ఆవేదనతో ఆందోళనకు గురై లబోదిబోమంటున్నాడు. రెవెన్యూ అధికారులు సక్రమంగా కొలతలు నిర్వహించకపోవడం వల్ల నాలుగు కుంటల భూమి పోయిందంటూ అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నగేష్ భూమిలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నాలుగు కుంటల రహదారికి గెట్టు రాళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు సక్రమమైన పద్ధతిలో కొలతలు నిర్వహించి రహదారికి అదనంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించి రహదారి పనులు చేపట్టాలని డివైఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శి బట్టు రాజు,మెట్టెల సతీష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.