Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవోస్ ప్రకటన అర్థ రహితం
- టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి
నవతెలంగాణ-సత్తుపల్లి
రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా ఈ వేసవి కాలంలోనే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ షెడ్యూల్‌ను తక్షణమే విడుదల చేయాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావా రవి డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక యూటీఎఫ్ డివిజన్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన రవి మాట్లాడారు. ముఖ్యమంత్రి, విద్యాశాఖా మంత్రి ఈ వేసవి కాలంలో షెడ్యూల్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన నేపధ్యంలో ఉపాధ్యా యులంతా ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. వేసవి సెలవులు ప్రారంభమై రెండు వారాలు గడుస్తున్నా ఇంకా షెడ్యూల్ ప్రకటించపోవడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. షెడ్యూల్ కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులంతా ఈ జాప్యంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారన్నారు. షెడ్యూల్ విడుదల చేసే క్రమంలో కోర్డు వివాదాలుంటే తుదితీర్పుకు లోబడి సమీక్షించే విధంగా షరతులతో కూడిన పదోన్నతులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ పలు సూచనలు చేశారు. ఈనెల 16వ తేదీలోపు షెడ్యూల్‌ను విడుదల చేయాలని లేనిపక్షంలో 18వ తేదీన కలెక్టర్ కార్యాలయాల ఎదుట ధర్నా, మే 31న ఇందిరా పార్కు వద్ద మహాధర్నా కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఇతర సంఘాలతో చర్చించి మూల్యాంకన బహిష్కరణ తదితర ఉద్యమ కార్యాచరణను తెలిపారు. అదేవిధంగా ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, సప్లిమెంటరీ బిల్లుల విడుదలలో జాప్యాన్ని నివారించాలని కోరారు.
టీఎన్జీవోస్ ప్రకటన అర్థ రహితం....
ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం అమలు కోసం ఉద్యోగుల వేతనాల నుంచి ప్రతీ నెల 2% చందా చెల్లిస్తామని టీఎన్జీవోల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి అంగీకార లేఖ సమర్పించడంపై రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సంక్షేమ రాజ్యంలో ఉద్యోగుల ఆరోగ్య రక్షణ బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఉద్యోగులందరికీ టీఎన్జీవోల సంఘం ప్రతినిధి కాదన్నారు. రాష్ట్రంలో పలు సంఘాలున్నాయని, ఉద్యోగుల్లో సగానికిపైగా ఉన్న ఉపాధ్యాయులు వివిధ సంఘాల్లో ఉన్నారన్నారు. అందరినీ సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే సహించేదిలేదని హెచ్చరించారు. నగదు రహిత వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి బి.రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కిషోర్‌సింగ్, కృష్ణ, జిల్లా నాయకులు వెంకన్న, జల్లిపల్లి మురళీమోహన్, వీవీ రామారావు, మట్టపర్తి.రాజేశ్వరరావు, బాల నాగేశ్వరరావు, కొప్పుల శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు గాదె నరసింహారెడ్డి, బి.ఈశ్వరాచారి, వీరాస్వామి, ఐ.నాగేశ్వరరావు, సూరయ్య, మధు, నెల్లూరి వీరబాబు, రాజశేఖర్ పాల్గొన్నారు.