Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ
నవతెలంగాణ-కల్లూరు
పురుషాధిక్య భావజాలం నుంచి వచ్చే ఆధిక్యతా భావనలతోనే స్త్రీలపై దాడులు జరుగుతున్నాయని ప్రగతిశీల మహిళా సంఘం (పీఓడబ్ల్యు) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చండ్ర అరుణ అన్నారు. అన్ని రంగాల్లో జరిగే శ్రమలో స్త్రీలదే ప్రధాన పాత్ర అయినా అన్నింట్లో వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పీవోడబ్ల్యూ మండల అధ్యక్షురాలు జె.పరిమళ అధ్యక్షతన శనివారం స్దానిక ఇమేజ్ ఫంక్షన్ హాల్లో కల్లూరు - వైరా డివిజన్ స్థాయి పిఓడబ్ల్యు మూడో మహాసభల్లో చండ్ర అరుణ పాల్గొని ప్రసంగించారు. సంఘం డివిజన్ అధ్యక్షురాలు గంటా వెంకట నరసమ్మ మహిళా సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సభలో చండ్ర అరుణ మాట్లాడుతూ స్వదేశీ, ప్రాంతీయ పేర్లతో జరుగుతున్న పాలనలో రాజ్యాంగం కల్పించిన సమాన అవకాశాలు స్త్రీలకు దక్కడం లేదన్నారు. ఆస్తిలో సమాన హక్కులు చట్టాలకే పరిమితమయ్యాయని, సమాన పనికి సమాన వేతనం అందడం లేదన్నారు. అన్ని రాజ్యాంగ విలువలకు పాతరవేస్తూ స్త్రీలపై హింస కొనసాగుతోందన్నారు.ఆహారం తోపాటు వస్త్రధారణ మీద కూడా ఆంక్షలు కొనసాగడం శోచనీయమన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర పాలనలో కూడా చట్టసభల్లో స్త్రీలకు అవకాశాలు లేకపోవడం గర్హనీయమన్నారు. వితంతు, ఒంటరి , వద్ద మహిళలు గత మూడేళ్ళ నుంచి ఆసరా పెన్షన్ ల కోసం ఎదురు చూడాల్సి వస్తుందన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జి లలిత, శిరోమణి , డి.శిరీష లు మాట్లాడుతూ పోడు భూములను సాగుచేసుకుంటున్న మహిళలపై తెలంగాణ ప్రభుత్వం ఫారెస్ట్ అధికారులతో దాడులు చేయిస్తూ జైళ్ల పాలుచేయడం దారుణమని విమర్శించారు. ఈ సభల్లో పౌర హక్కుల సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కాటినేని శ్రీనివాసరావు, సీపీఐ ఎంఎల్ (ప్రజాపంధా) డివిజన్ కార్యదర్శి అర్జునరావు, ప్రజా పంథా మండల కార్యదర్శి బీరెల్లి లాజర్, మాల్యాద్రి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె పుల్లారావు పాల్గొన్నారు.