Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్‌ను ఆదేశించిన మంత్రి గంగుల
- రైతు సంఘం విజ్ఞప్తి మేరకు నిర్ణయం
నవతెలంగాణ-వైరా
రబీలో అంతంత మాత్రంగా పండిన ధాన్యాన్ని కొనుగోలు చేయటంలో తీవ్ర జాప్యం జరుగుతుందని, కొనుగోలు ప్రారంభించిన కేంద్రాలలో రైతులు మిల్లు యాజమాన్యాల దోపిడీకి గురవుతున్నారని జిల్లా రైతు సంఘం ఆధ్వర్యంలో మంత్రులకు వివరించారు. శనివారం వైరా మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై శాఖా మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్‌లు సందర్శించారు.ఈ సందర్భంగా యాసంగిలో వరి పండించిన రైతులు పడుతున్న అవస్థలను మెమొరాండం ద్వారా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు బొంతు రాంబాబు నాయకత్వంలో మంత్రులకు అందజేశారు. కొణిజర్ల మండలంలోని ఎస్ఆర్ రైస్ మిల్లు యాజమాన్యం రైతుల ధాన్యంలో 10 కేజీల చొప్పున కోత పెట్టీ దోపిడీ చేస్తున్న విషయాన్ని వివరించగా వెంటనే ఎస్ఆర్ రైస్ మిల్లును సీజ్ చేయాలని మంత్రి గంగుల, జిల్లా కలెక్టర్ విపి గౌతంను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించని మండలాల్లో వెంటనే కేంద్రాలను ప్రారంభించాలని, రైతుసంఘం విజ్ఞాపనలో పేర్కొంది. నేలకొండపల్లి మండలంలోని రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయని కారణంగా ఆందోళనకు పూనుకున్నారని, తొలుత 5 కేజీల కటింగు అని చెప్పి ధాన్యం మిల్లులకు చేరిన తర్వాత 10 కేజీల చొప్పున కటింగ్ చేసి రైతులను మోసగించినట్లు మంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి స్పందించి 40 కేజీల బస్తాకు 600 గ్రాములు మాత్రమే అదనంగా కాటా వేయాలని, అంతకు ఎక్కువ కాటా వేస్తే చర్యలు తప్పవని, అదనంగా కాటా వేస్తే కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న అధికారులే బాధ్యులు అవుతారన్నారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ మంత్రుల పర్యటన ఆర్భాటంగా ఉన్నదని, రైతుల బాధలు విని పరిష్కారం చేయాలనే ఆలోచన లేదని, 5 నిముషాలలో కార్యక్రమం ముగించు కుని వెళితే రైతుల కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు తోట నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, మల్లెంపాటి రామారావు, అనుమోలు రామారావు, బాజోజు రమణ, బెజవాడ వీరభద్రం, బోల్లేపోగు శ్రీను, వాసిరెడ్డి విద్యాసాగర్ రావు, యనమద్ది రామకృష్ణ పాల్గొన్నారు.