Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజరుకుమార్
- రూ.3.50 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనం ప్రారంభం
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
బి.సి యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు, ఉద్యోగ అవకాశాలు పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం బి.సి స్టడీ సర్కిల్స్‌ను ఏర్పాటు చేసిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, రాష్ట్ర బి.సి. సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ఖమ్మం నగరం తెలంగాణ తల్లి సర్కిల్లో రూ.3.50 కోట్ల వ్యయంతో నిర్మించిన బి.సి. స్టడీ సర్కిల్ భవనాన్ని మంత్రులు శనివారం ప్రారంభించారు. మంత్రి పువ్వాడ అజరు మాట్లాడుతూ బి.సి కులాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తున్నదన్నారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు జిల్లా అభివృద్ధికి అడిగిన వెంటనే నిధులు మంజూరు చేస్తూ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల అమలుతో పాటు అన్ని రంగాలలో జిల్లాను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తున్నారని మంత్రి తెలిపారు. బి.సి కులాలకు అన్ని విధాలుగా ఉపయోగపడేందుకు మరో రెండు కోట్లతో బి.సి భవనాన్ని ఏర్పాటు చేశామన్నారు. రాబోయే రోజుల్లో కమ్యూనిటీ హల్, శుభకార్యాలు, స్కిల్స్ డెవలప్మెంట్ మెరుగుపర్చుకునేందుకు హబ్ తరహాలో సముదాయాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రయివేటు భవనంలో నిర్వహిస్తున్న బి.సీ స్టడీ సర్కిల్ సెంటర్ ను శాశ్వత భవనంలోకి మార్చామన్నారు. పోటీ పరీక్షలకు కావల్సిన పుస్తకాలు, బోధకులను సమకూర్చామన్నారు. రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ బి.సి.ల సంక్షేమానికి సీఎం కె. చంద్రశేఖర్ రావు పెద్ద పీట వేశారని, అగ్రవర్ణాలతో సమానంగా బి.సి యువత ఉన్నత విద్యనభ్యసించి అన్ని రంగాలలో రాణించాలనే సంకల్పంతో ఉందన్నారు. రాష్ట్రంలో గతంలో 19 గురుకులాలు ఉంటే నేడు 281 బి.సి గురుకులాలను ఏర్పాటు చేసుకున్నామన్నారు. బి.సి గురుకులాల్లో లక్షా 58 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం యువతకు స్టడీ సర్కిల్ నిర్వహించింది లేదన్నారు. కార్పొరేటు స్థాయి స్టడీ సర్కిల్ ను టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. గ్రూప్-1, అన్ని ఉద్యోగాలకు యువత పోటీపడి జిల్లా నుండి ఎక్కువ మంది ఉద్యోగాలు సాధించాలని మంత్రి కోరారు. నేడు ఉద్యోగాల సాధనలో ఇంటర్వ్యూలు లేవని, పైరవీలకు తావులేదని మెరిట్ ప్రాతిపదికన ఉద్యోగల కల్పనకు సీఎం శ్రీకారం చుట్టారని మంత్రి తెలిపారు. బి.సి యువత కోసం రూ.3. 50 కోట్లతో నిర్మించిన బి.సి స్టడీ సర్కిల్ భవనంలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, అడ్మిన్ బ్లాక్, లెక్చర్ హాల్స్, స్టడీ రూమ్స్, డైనింగ్ హాల్, డార్మటరీతో ఆర్. అండ్.బి శాఖ ద్వారా నిర్మించామని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మేయర్ పునుకొల్లు నీరజ, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, బి.సి స్టడీ సర్కిల్ కో-ఆర్డినేటర్ శ్రీలత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి జ్యోతి, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.