Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ప్రమాదవశాత్తు లకారం ట్యాంకు బండ్లో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. నగరంలోని లకారం ట్యాంకు బండ్ వద్ద పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు నగరానికి చెందిన ముగ్గురు యువతులు, నలుగురు యువకులు శనివారం ఉదయం వచ్చారు. అయితే అక్కడ ఉన్న సిబ్బంది అనుమతించకపోవడంతో వెనక్కి వెళ్లిపోయారు. మరల కొంత సేపటి తర్వాత వారు అక్కడకు చేరుకొని కేక్ కట్ చేశారు. పుట్టినరోజు జరుపుకున్న యువతి వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోయింది. అక్కడే ఉన్న ఆరుగురిలో అన్నవరపు నాగభార్గవ్(19) చేతులకు అంటుకున్న కేకు కడుక్కునేందుకు ఇనుప గ్రిల్స్ దాటుకొని చెరువు వద్దకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో కాలుజారి ప్రమాదవశాత్తూ చెరువులో పడిపోయాడు. అతనికి ఈత రాకపోవడంతో కేకలు వేశాడు. వెంటనే పక్కనే ఉన్న ఇద్దరు స్నేహితులు కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. అయితే వారిని గట్టిగా పట్టుకోవడంతో వారు నాగభార్గవన్ను వదిలించుకొని బయటకు వచ్చారు. ఈ ఘటనను గమనించిన చెరువు వద్ద పనిచేస్తున్న కొందరు వచ్చి భార్గవ్‌ను నీళ్లలో నుంచి బయటకు తీశారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి వెళ్లిన నాగభార్గవ్ను స్నేహితులు ద్విచక్రవాహనంపై ఎక్కించుకొని దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో భయపడిన స్నేహితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుటుంబ సభ్యులు, బందువులు ఆసుపత్రి వద్దకు చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నాగభార్గవ్ నగరంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాల్లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఖమ్మంలోని గట్టయ్య సెంటర్లో ఏడాది కాలంగా ఓ బహుళ అంతస్తుల భవనంలో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరి స్వగ్రామం కొణిజర్ల మండలం తనికెళ్ల గ్రామం. చేతికొచ్చిన కొడుకు మృత్యువాత పడటంతో వారు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్ టౌన్ సీఐ చిట్టిబాబు కేసు. నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.