Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి నెల పదో తేదీ లోపు వేతనాల చెల్లింపునకు చర్యలు
- 20వ తేదీ నాటికి రెండు నెలల పెండింగ్ వేతనాలు చెల్లిస్తామని హామీ
- సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
మిషన్ భగీరథ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో రెండు రోజులుగా పర్ణశాల పంప్ హౌస్ వద్ద చేపట్టిన కార్మికుల సమ్మెకు అధికారులు కావేరీ ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్యం వారు స్పందించారు. ఫిబ్రవరి, మార్చి నెల వేతనాలను మే 20వ తేదీ నాటికి కార్మికుల ఎకౌంట్లో జమ చేస్తామని కావేరీ ఇన్ఫ్రా కంపెనీ ఎండి మిషన్ భగీరథ ఈఈకి లిఖితపూర్వకంగా లేఖ రాసినట్లు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మచారి తెలిపారు. అదే లేఖను మిషన్ భగీరథ ఈఈ, డీఈ, సీఐటీయూ నాయకులకు కార్మికులకు అందజేసినట్టు తెలిపారు. లేఖ ఆధారంగా కార్మికులు చేపట్టిన సమ్మెను విరమించాలనే అధికారుల అభ్యర్ధన మేరకు కార్మికులు సమ్మె విరమించి రెండు రోజులుగా విధులకు హాజరవుతారని ఆయన అన్నారు. పంపు హౌస్ వద్ద శనివారం జరిగిన సమావేశంలో బ్రహ్మచారి మాట్లాడుతూ... ఈ నెల 20వ తేదీ సాయంత్రానికి వేతనాలు కార్మికుల ఎకౌంట్లో పడాలని లేనియెడల ఈ సారి సమ్మె శిబిరాన్ని పాల్వంచ తోగ్గుడెం వద్ద ఈఈ కార్యాలయం ముందు వంటావార్పు పెట్టి సమస్యలపై తాడోపేడో తేలుస్తామని ఆయన అన్నారు. ప్రతి నెల పదవ తేదీ లోపు వేతనాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటామని, వేతనాలు బకాయి పడకుండా అందించటంకోసం అధికారులు బాధ్యత తీసుకొని సంబంధిత కావేరి ఇన్ఫ్రా కంపెనీ యాజమాన్యంతో నిరంతరం అందుబాటులో ఉంటూ వేతనాల సమస్య లేకుండా చేస్తామని గుర్తింపు కార్డులు పని గంటలు తదితర సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకో వాలన్నారు. ప్రభుత్వం కాంట్రాక్టు విధానాన్ని తీసుకొచ్చి కార్మికులను వెట్టి చాకిరీ చేస్తూ సకాలంలో వేతనాలు ఇవ్వ కుండా శ్రమ దోపిడీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కాంట్రాక్టు విధా నాన్ని రద్దు చేసి మిషన్ భగీరథ మంచి నీటి నిర్వహణ మొత్తాన్ని ప్రభుత్వం శాశ్వత పథకంగా గుర్తించి ఇందులో పనిచేస్తున్న కార్మికులు పర్మినెంట్ చేయాలని కనీస వేతనాలు, చట్ట బద్ధమైన సౌకర్యాలు కల్పించాలని సీఐటీయూగా తాము డిమాండ్ చేస్తున్నామన్నారు.
కార్మికుల శ్రమకు తగిన గుర్తింపు గౌరవాన్ని ఇవ్వకుండా కావేరీ ఇన్ఫ్రా కంపెనీ వారు కార్మికులను చులకన భావంతో చూస్తున్నారని ఇటువంటి చర్యలు మానుకోవాలని లేనియెడల కార్మికుల పట్ల యాజమాన్య కక్షసాధింపు చర్యలకు వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐటీయూ మండల కన్వీనర్ కొరసా చిలకమ్మ, మిషన్ భగీరథ యూనియన్ నాయకులు సాయిచంద్, పవన్, శ్రీను కార్మికులు పాల్గొన్నారు.