Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులకు కలెక్టర్ ఆదేశం
- ప్రజావాణిలో ప్రజల వినతులు స్వీకరించిన కలెక్టర్
నవతెలంగాణ-కొత్తగూడెం
పల్లె ప్రగతి తదితర అంశాలపై ఈ నెల 18వ తేదీన హైదరాబాదులో ముఖ్యమంత్రి నిర్వహించనున్న సమీక్షా సమావేశానికి సంబంధించిన నివేదికలు అందచేయాలని అధికారులను కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో నిర్వహించిన ప్రజావాణిలో పాల్గొన్న ఆయన ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన నిర్వహించనున్న సమావేశంలో వర్షాకాలం సాగు ప్రణాళిక, సీతమ్మ సాగర్, సీతారామ, ధరణి, సమీకృత జిల్లా అధికారుల సముదాయం, వైద్య, టీచింగ్ కళాశాలలు, ధాన్యం కొనుగోళ్లు, వ్యాక్సినేషన్, పల్లె దవాఖానాలు, దళితబంధు, ఎస్టీ ఆవాసాలకు త్రీ ఫేజ్ విద్యుత్ సరఫరా, హరితహారం మనవూరు మనబడి, పల్లె ప్రగతి కార్యక్రమాలు నిర్వహణపై సమగ్ర నివేదికలు అందచేయాలని చెప్పారు. మనవూరు-మనబడి కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామి పథకం ద్వారా చేపట్టనున్న మరుగుదొడ్లు, కిచెన్లు, ప్రహరి గోడల నిర్మాణ పనులు డూప్లికేట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ధాన్యం తేమశాతం 26 ఉన్నపుడు పంట కోత కోయడం వల్ల కొనుగోళ్లులో నిర్దేశిత తేమ శాతం ఉండటానికి అవకాశం ఉంటుందని, రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యం సకాలంలో మిల్లర్లును రవాణా చేసేందుకు లారీలు కొరత రాకుండా చూడాలని డియంను ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీలలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిర్మాణానికి భూమిని సిద్ధం చేయాలని చెప్పారు. ప్రజావాణిలో వచ్చిన పిర్యాదులు ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. వెంటనే వాని పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డీ అశోక్ చక్రవర్తి, అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.