Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలి
- అక్రమనకు గురవుతున్న భూమిని కాపాడాలి
- అశ్వరావుపేట రైతులు కలెక్టరేట్ ఎదుట ఆందోళన
నవతెలంగాణ-కొత్తగూడెం
అశ్వారావుపేట, గుమ్మడి వల్లి పెద్ద వాగు ప్రాజెక్టు శిథిలమవుతుందని, ప్రాజెక్టు మరమ్మతులు చేయాలని, ప్రాజెక్టు భూమి ఆక్రమనకు గురవుతుందని, ఆ భూమిని కాపాడాలని, మరమ్మతులకు గురైన ప్రాజెక్టు గేట్లను వెంటనే మరమ్మతులు చేసి ఆ ప్రాంత రైతాంగాన్ని కాపాడాలని, ప్రాజెక్టుకు బౌండ్రీలు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ అశ్వారావుపేట రైతులు కలెక్టరేట్ ముందు సోమవారం ఆందోళన నిర్వహించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడారు. అశ్వారావుపేట మండలం గుమ్మడిపల్లి గ్రామంలో ఉన్న పెద్ద వాగు ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు గత 3ఏండ్లుగా ఆందోళన చెందుతున్నారన్నారు. ప్రాజెక్ట్ సమస్యలు ఎన్నో ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1975లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హయాంలో పెద్ద వాగు ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. ప్రాజెక్టు శిథిలమవుతున్నప్పటికీ నేటి పాలకులు పట్టించుకోక పోవడం లేదని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు అనేక పర్యాయాలు విన్నవించినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేవని వాపోయారు. రోజు రోజుకు ప్రాజెక్టు స్వరూపం మారిపోయిందని, లాకులు దెబ్బతిన్నాయని ఇరిగేషన్ అధికారులు ఈ వైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శించారు. ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 1124 ఎకరాల భూముల్లో 500 ఎకరాల భూమి అన్యాక్రాంతం అయిందని రైతులు కలెక్టర్కు తెలిపారు. ప్రాజెక్టు కింద సుమారు 11వేల ఎకరాల పంటలు పండుతు న్నాయని తెలిపారు. నీరు పుష్కలంగా ఉంటే ఏడాదికి రెండు పంటు పండే అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రాజెక్టు విషయం పట్టించుకుని రెండు పంటలకు నీళ్లు అందేలా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆయకట్టు రైతులు సత్యనారాయణ, ధర్మయ్య, ఎం.రాజారావు, రామారావు తదితరులు ఉన్నారు.
స్పందించిన కలెక్టర్ అనుదీప్...
అశ్వారావుపేట పెద్ద వాగు ప్రాజెక్టు విషయంలో కలెక్టర్ అనుదీప్ వెంటనే స్పందించారు. ఇరిగేషన్ ఈఈ అర్జున్ను పిలిచి వెంటనే ప్రాజెక్టు గేట్లు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. ఈ వారంలో పనులను మొదలు పెట్టి ప్రయత్నం చేస్తామని అధికారులు చెప్పడంతో వర్షాకాలం సమీపిస్తుందని, ఇంకెప్పుడు చేస్తారంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ ఆక్రమణల విషయం కూడా తేలుస్తామని రైతులకు హామీ ఇచ్చారు.