Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సారపాకలో చక్రం తిప్పుతున్న ఓ వ్యాపారి కుమారుడు..?
- బెట్టింగ్‌లో జోగుతున్న యువత
- కొత్త ఎస్ఐకు...కొత్త సవాళ్లు
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోని బూర్గంపాడు మండలంలో ఐపీఎల్-2022 బెట్టింగ్‌ల జోరు రోజురోజుకీ పెరుగుతోంది. టాటా ఐపీఎల్-2022 క్రికెట్ మ్యాచ్‌లు రసవత్తరంగా మారటంతో బెట్టింగులు కూడా అదే స్థాయిలో మారాయి. ఈ బెట్టింగ్ వ్యవహారంలో బూర్గంపాడు మండలంలోని యువత జోగుతోంది. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో బూర్గంపాడుకు చెందిన ఓ యువకుడు అప్పులపాలై, డబ్బులు చెల్లించలేక, మన స్థాపంతో ఇంట్లోనే ఉరేసుకుని సాయి కిషన్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. ఈ సంఘటనకు గల కారణం ఐపీఎల్ బెట్టింగే అని జోరుగా ప్రచారం సాగుతోంది. మండలంలో ఐపీఎల్ బెట్టింగ్‌లో వ్యవహారం ఏ స్థాయిలో ఉందనేది ఈ యువకుని ఆత్మహత్య సంఘటనకు సాదృశ్యంగా చెప్పవచ్చని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా బూర్గంపాడు మండలంలోని సారపాక, లక్ష్మీపురం, బూర్గంపాడు, మోరంపల్లి బంజర తదితర గ్రామాలలో ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం జోరుమీద ఉందని వ్యాఖ్యలు వినబడుతున్నాయి.
సారపాకలో చక్రం తిప్పుతున్న ఓ వ్యాపారి కుమారుడు?
బూర్గంపాడు మండల పరిధిలోని పారిశ్రా మిక ప్రాంతమైన సారపాకలోని ఓ వ్యాపారి కుమారుడు ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో చక్రం తిప్పుతున్నాడనే వ్యాఖ్యలు వినబడుతున్నాయి. వ్యవహారంలో ఓ యువకుని వద్ద కారును సైతం తీసుకొని తనకు రావలసిన బెట్టింగ్ సొమ్మును జమ చేసుకున్నాడని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే తరుణంలో సార పాకలో గ్రూపులుగా ఏర్పడిన కొందరు యువకులు ఐపీఎల్ బెట్టింగులు ప్రధాన రహదారుల కూడలిలోనే సెల్ ఫోన్ ద్వారా ఆన్ లైన్లో, ప్రత్యక్ష తరహాలో పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
కొత్త ఎస్సైకు...సరికొత్త సవాళ్లు...!
బూర్గంపాడు పోలీస్ స్టేషన్‌కు కొత్తగా ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన సురేష్‌కు మండలంలో జరుగుతున్న చోరీలు.. సాగుతున్న బెట్టింగ్ వ్యవహారం... కొత్త సవాళ్ళుగా మారాయని చెప్పవచ్చు. ఈ నెల 5వ తేదీ రాత్రి పారిశ్రామిక ప్రాంతమైన లక్ష్మీపురం గ్రామంలో వరుసగా ఒకేరాత్రి నాలుగు చోట్ల చోరీలు జరగటంతో సంచలనాన్ని కలిగించింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా రెండు వైన్ షాపుల్లో, బంగారు షాపులలో, ఓ దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడటం వ్యవహారం మండల వ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని ప్రజల్లో భయాన్ని కలిగించిందని చెప్పవచ్చు. ఈ సమయంలో లక్ష్మీపురం వైన్ షాప్‌లో జరిగిన చోరీ సంఘటనలో పాల్పడిన వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా సీసీ కెమెరాలను చూస్తూనే దర్జాగా చోరికి పాల్పడిన వ్యవహారం పరిశీలిస్తే రిక్కీ నిర్వహించే ఈ చోరీలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ చోరీల ఈ సంఘటనపై బూర్గంపాడు పోలీసులు వివిధ కోణాల్లో విచారణ నిర్వహిస్తున్నారు. ఇదే తరుణంలో మండల కేంద్రమైన బూర్గంపాడులోని యం.సాయి కిషన్ (23) యువకుడు సోమవారం తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన వెనుక ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారమే ఉందని ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మాత్రం ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఆ ప్రయత్నాలు ఫలించకపో వడంతో మనోవేదనకు గురై సాయికిషన్ ఆత్మహత్యకు పాల్పడినట్టు బూర్గంపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కాగా ఈ యువకుడు ఆత్మహత్యకు ప్రధాన కారణం ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో సోమ్ములు పోగొట్టుకోవడంమే కాకుండా అప్పులపాలై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
ఎస్ఐ దృష్టి పెడితే...
బూర్గంపాడు మండలంలో పెరుగుతున్న చోరీలు.. జోరుగా సాగుతున్న ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ వ్యవహారంపై కొత్త ఎస్సై సురేష్ తన మార్కును చూపించాలని, మండలంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్న ప్రాంతాలపై మరింత నిఘా పెంచాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.