Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు
నవతెలంగాణ-జూలూరుపాడు
ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యలపై మండలంలోని 20 గ్రామ పంచాయతీలు కలుపుతూ, 60 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించారు. పాదయాత్ర మే 16 కొమ్ముగూడెంలో ప్రారంభమై 17న జూలూరుపాడు మండల కేంద్రంలో ముగిసింది. ఈ పాదయాత్రకు 30 ప్రజా సంఘాలు, 2 విద్యార్థి సంఘాలు, 5 రాజకీయ పార్టీలు, 3 స్వచ్ఛంద సంస్థలు సంఘీభావం తెలిపాయి. మంగళవారం జూలూరుపాడు సెంటర్లో జిల్లా అధ్యక్షులు గార్లపాటి పవన్ అధ్యక్షతన జరిగిన పాదయాత్ర ముగింపు సభలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారానికై మండల వ్యాప్తంగా 60 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ, బిసి విద్యార్థి, విద్యార్థినీలకు కళాశాల హాస్టళ్లు మంజూరు చేయాలని, ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టాలని, మండల కేంద్రంలో పబ్లిక్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలని ఈ పాదయాత్ర సాగుతున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా సమస్యలపై పోరాటాలు ఉదృతం చేస్తాం
: ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బుర్రా వీరభద్రం
జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వంపై దశలవారీ పోరాటాలు నిర్వహించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు.
ఈ పాదయాత్ర ముగింపు సభలో సంఘీభావంగా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు చీమలపాటి భిక్షం, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు యాసా నరేష్, డీవైఎఫ్ఐ నాయకులు చందర్ రావు, గిరిజన సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బానోత్ మధు, కొమ్ముగూడెం మాజీ ఎంపీటీసీ భానోత్ ఇస్రా, లక్ష్మయ్య హాజరై మాట్లాడారు. పాదయాత్ర బృందంలో జిల్లా ఉపాధ్యక్షులు భూపేందర్, నవీన్ కొట్టే, జిల్లా సహాయ కార్యదర్శి బోడ అభిమిత్ర, జిల్లా సహాయ కార్యదర్శి పద్దం మేఘన, జోన్ అధ్యక్షులు భూక్యా వెంకటేష్, మండల అధ్యక్షులు పద్దం మంజుల, కార్యదర్శి యశ్వంత్, మండల కమిటీ సభ్యులు పి.పవన్, నూతి భవాని, కొడెం అఖిల, కుంజా సాయి ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు.