Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యాయామంపై అశ్రద్ధ వద్దు
- భద్రాచలం ఐటిడిఎ పిఓ గౌతమ్ పొట్రు
నవతెలంగాణ-భద్రాచలం
ఐటీడీఏ ద్వారా ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు కఠినంగా ఉండే సబ్జెక్టులపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు సబ్జెక్ట్ కనుగుణంగా చదివితే నూటికి నూరు మార్కులు తెచ్చుకొని ఉద్యోగం సంపాదించవచ్చని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు సూచించారు. గురువారం వైటిసి, పిఎంఆర్సి, ఎన్ఆర్సి భవనంలో ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులకు కొన్ని సూచనలు ఇస్తూ శిక్షణ అనేది చాలా శ్రద్ధతో తీసుకోవాలని మనసులో తప్పుడు ఆలోచనలు పెట్టుకొని శిక్షణ తీసుకుంటే ముందుకు పోలేమని కనుక శిక్షణకు వచ్చిన అభ్యర్థు లు పోటీ పరీక్షలలో పాల్గొని ధృఢ సంకల్పంతో అనుకున్నది సాధిస్తామని మైండ్ సెట్ లో పెట్టుకొని పరీక్షలకు సిద్ధం కావాలని ఆయన అన్నారు. ముఖ్యంగా ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యంగా పదహారు వందల పరుగు పందెం, షార్ట్ ఫుట్ పై అభ్యర్థులకు తప్పకుండా చేయించాలని సంబంధిత పీడీ లకు ఆదేశించారు. అనంతరం అభ్యర్థులకు అందించే యూనిఫామ్, బూట్లు, టీ షర్ట్లు, స్టడీ మెటీరియల్ పరిశీలించి ఈ శనివారం నాటికి అభ్యర్థులందరికీ పూర్తిస్థాయిలో అందజేయాలని ఆయన అన్నారు. అనంతరం అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా డైనింగ్ హాల్ ఫ్యాన్లు, లైట్లు ప్రతి క్లాస్ రూమ్ లో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిడి ట్రైబల్ వెల్ఫేర్ రమాదేవి, ఏపీఓ (జనరల్) డేవిడ్ రాజ్ పాల్గొన్నారు.