Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వ్యవసాయానికి ఏడేళ్ళలో రూ.3.75 లక్షల కోట్లు
- తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడికి శిక్షణ
- ప్రతి రైతువేదికలో పంటలు, క్లస్టర్ వివరాలు
- వానకాలం సాగు సమాయత్తంపై సదస్సులో రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
డిమాండ్ ఆధారంగా పంటలు సాగు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార శాఖ మంత్రి ఎస్. నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయానికి ఏడేళ్ళలో రూ.3.75 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. వానకాలం సాగు సమాయత్తంపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులకు గురువారం ఖమ్మం నగరంలోని ఎస్.ఆర్.గార్డెన్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో జ్యోతిప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జిల్లాలో సగటు వర్షపాతం అధికంగా ఉందన్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, ప్రభావం కూడా జిల్లాపై ఉందన్నారు. వ్యవసాయ ఆర్ధిక సంపత్తిలో ఖమ్మం జిల్లా రైతులు ఒకమెట్టు ఎదిగి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో ఆధునీక పద్ధతులు, మెళుకువలు, సస్యరక్షణ, యాంత్రీకరణ, తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి పట్ల రైతువేదికలలో నిరంతరం రైతుశిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మార్కెట్ డిమాండు బట్టి సీజన్ వారీగా రైతులు ఏ పంటలు సాగుచేయాలి, ఎరువులు ఎంత మోతాదులో వాడాలి అనే విషయాలను వ్యవసాయ విస్తరణ అధికారులు రైతు వేదికల ద్వారా తెలపాలన్నారు. జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మన ఆహార ఉత్పత్తులు ఉండేలా చూడాలని వ్యవసాయ అధికారులకు మంత్రి సూచించారు. దీర్ఘకాలిక ప్రణాళిక, ఆర్థిక సంపత్తి, వనరులను సమకూర్చుకోవడం, ఉపాధి రంగాల ప్రాధాన్యతపై విశ్లేషించారు. గత ఏడేళ్ల కాలంలో మూడు లక్షల 75 వేల కోట్లు వ్యవసాయానికి ఖర్చు చేశాం అన్నారు. రైతుబంధు పథకం కింద 50 వేల కోట్లు ఖర్చు చేసిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు., రాష్ట్రంలో పంటల ఉత్పాదకత మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర వ్యవసాయ రంగం ఆధునీక పద్ధతుల ద్వారా పురోగమించాలని, రైతు వేదికలలో దీర్ఘకాలిక పంటలకు అసవరమైన శిక్షణ శిబిరాలు నిర్వహించబోతున్నామని తెలిపారు. పెట్టుబడి తగ్గించే మార్గాలను అన్వేశించాలన్నారు. భూసారాన్ని, దిగుబడి, ఆదాయం పెంచే మార్గాలు చూడాలన్నారు. సహజమైన ఎరువులు వాడకం, శాస్త్రవేత్తల సూచనలను పాటించే విధంగా రైతువేదికలలో శిక్షణ ద్వారా రైతులను అవగాహన పర్చాలని మంత్రి తెలిపారు. వ్యవసాయ రంగం భవిష్యత్ ను మారుస్తామని యువత పనిపట్ల గౌరవం. పెంచుకోవాలని వ్యవసాయం అంటే పంటలు పండించేది కాదని సమాజాన్ని నిర్మించేది, సంస్కరించేదని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడే నాటికి 1.8 శాతం ఉన్న వ్యవసాయ వద్ధిరేటు నేడు 8.1 శాతాని పెరిగిందని మంత్రి తెలిపారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ మాట్లాడుతూ పంట విధానంలో ఖమ్మం జిల్లా ఒక మ్యూజియంలా నిలవాలన్నారు. ఖమ్మం జిల్లాలో 129, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 67 మంది వ్యవసాయ విస్తరణాధికారులను నియమించామని తెలిపారు. ప్రతి క్లస్టర్ కు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉన్నారన్నారు. ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ దేశంలో రైతుల గురించి ఆలోచన చేసినది కేవలం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించడంలో భాగంగా రాబోయే రోజుల్లో 10 లక్షల ఎకరాలలో ఆయిల్‌పామ్ సాగు విస్తరించబోతుందని తెలిపారు. రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 30 వేల కోట్లు కేటాయించామన్నారు. వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్ రావు మాట్లాడుతూ ప్రతి రైతువేదికలో క్లస్టర్ కు సంబంధించిన వివరాలు, పంట వివరాల సమాచారం పూర్తి స్థాయిలో ఉండాలన్నారు. వారానికి రెండురోజులు తప్పనిసరిగా రైతువేదికలలో రైతు శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలన్నారు. వ్యవసాయనుబంధ శాఖల అధికారులు శుక్రవారం నుండే జిల్లా వ్యాప్తంగా రైతువేధికలలో అవగాహన శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలని ఆయన తెలిపారు. రోజువారి జరిగే కార్యక్రమాల సమాచార సేకరణకు గాను ప్రత్యేక యాప్ ను ప్రవేశ పెట్డామన్నారు. ఈ యాప్ లో రోజువారీ కార్యకలాపాలను అప్లోడ్ చేయాలని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు వి.పి. గౌతమ్, దురుసెట్టి అనుదీప్, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమలరాజు, వైరా, సత్తుపల్లి, అశ్వరావు పేట శాసనసభ్యులు లావుడ్యా రాములు నాయక్, సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రాష్ట్ర మార్కెఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, డి.సి.సి.బి. డి.సి.ఎం.ఎస్ చైర్మన్లు కూరాకుల నాగభూషణం, రాయల శేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల్ల వెంకటేశ్వరరావు, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు సరిత, మరియన్న, రైతుబంధు సమితి కో-ఆర్డినేటర్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, వ్యవసాయనుబంధ శాఖల ఇరు జిల్లాల అధికారులు తదితరులు అవగాహన సదస్సులో పాల్గొన్నారు.