Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అంబేద్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులతో నిరసన
నవతెలంగాణ-ఇల్లందు
బిందును ప్రేరేపిత మరణానికి గురి చేసిన పోలీస్ కానిస్టేబుల్ తెలే శ్రీనివాస్‌ను నేరం జరిగి నెలలు గడుస్తున్నా పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదని పీఓడబ్ల్యు రాష్ట్ర కార్యదర్శి చండ్ర అరుణ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి హరికృష్ణ, ఏపీవైఎస రాష్ట్ర కార్యదర్శి భూక్య శ్రీనివాస్, పీడీఎస్‌యూ జిల్లా కార్యదర్శి కాంపాటి పృధ్వీ, ఏఐఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ హరీష్ గౌడ్, పీడీఎయూ జిల్లా అధ్యక్షులు సాంబ ప్రశ్నించారు. పట్టణంలోని కొత్త బస్టాండ్ సెంటర్లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద గురువారం నిందితుడు తెలే శ్రీనివాస్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బాధిత కుటుంబాలతో పాటు మహిళా, విద్యార్థి, యువజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్లకార్డ్స్‌తో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడుతూ బిందును పోలారం గ్రామానికి చెందిన తెలే శ్రీనివాస్ గత మూడు సంవత్సరాలుగా శారీరకంగా వాడుకొని, మానసిక వేధింపులకు గురి చేసి పెళ్లి చేసుకొని బిందుతో పాటు తన కుటుంబాన్ని సైతం వరకట్న వేధింపులతో ఒత్తిడికి గురిచేశాడు. శ్రీనివాస్ మోసపూరిత వైఖరి చూసి భరించలేక బిందు బలవన్మరణానికి కారణమైందని, బిందు మరణం ఆత్మహత్య కాదని ఇది తెలే శ్రీనివాస్ చేసిన హత్య అని వారు అన్నారు. తక్షణమే నేరస్తుడును అరెస్టు చేసి పోలీస్ శాఖ విధుల నుండి తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణ, శ్రీకాంత్, పీవైయల్ మండల కార్యదర్శి భాస్కర్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అభిమన్యు, ఏపీవైఎస్ జిల్లా కన్వీనర్ ప్రశాంత్, ఐఎఫ్టియు నాయకులు నాగేశ్వరరావు పాల్గొన్నారు.