Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తన నిజాయితీతో రాజకీయాలకు వన్నె తెచ్చిన మహానేత
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రజా పోరాటాల యోధుడు, తన నిజాయితీతో రాజకీయాలకు వన్నె తెచ్చిన మహానేతపుచ్చలపల్లి సుందరయ్య అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. గురువారం స్ధానిక మంచికంటి భవన్లో దక్షిణ భారత ఉద్యమ నిర్మాత, పీడిత ప్రజల ప్రియతమ నేత పుచ్చలపల్లి సుందరయ్య 37 వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. తొలుత సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు యంఎన్.రెడ్డి పూలమాల వేసి నివాళ్ళు అర్పించారు. అనంతరం జరిగిన సభలో జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లడుతూ భూస్వామ్య కుటుంబంలో జన్మించిన సుందరయ్య జీవితమంతా ప్రజా ఉద్యమాల నిర్మాణానికి, మార్క్సిస్టు సిద్ధాంత పరిరక్షణకు పాటుపడ్డారని, చిన్న వయసులోనే సంఘ సంస్కరణ, స్వాతంత్ర పోరాట దీక్ష అలవర్చుకున్న ఆయన బాల్యంలోనే కారాగార శిక్ష అనుభవించారన్నారు. దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి బీజాలు వేశారని తెలిపారు. దేశంలోనే తొలి వ్యవసాయ కార్మిక సంఘాన్ని స్థాపించారు. ఆంధ్ర, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో రహస్యంగా పర్యటిస్తూ నాయకులను, కార్యకర్తలను ఎంతోమందిని తయారుచేసి తీర్చిదిద్దారు. తన వాటాకి వచ్చిన యావదాస్తిని పార్టీకి ఉద్యమానికి ధారబోసి అత్యంత నిరాడంబరంగా, నియమబద్ధంగా, నిర్మాణాత్మకంగా జీవించారు. ప్రజలతో నిత్యం మమేకం కావడం, పోరాటాలు నడిపించడం, సిద్ధాంత అధ్యయనం, సమాజ పరిశీలన, ఉద్యమ నిర్మాణం ఇలా అన్ని విషయాల్లోనూ ఆయన తిరుగులేని యోధుడు అన్నారు. వీర తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యక్షంగా నాయకత్వం వహించారు. భూమిలేని నిరుపేదలకు ఆ పోరాటం రూ.10లక్షల ఎకరాల భూమిని పంచిపెట్టారని తెలిపారు. 3000 గ్రామాల్లో గ్రామ రాజ్యాలు ఏర్పర్చారన్నారు. కమ్యూనిస్టు పార్టీ తొలి కేంద్ర కమిటీలో సభ్యుడైన సుందరయ్య ఆఖరి వరకు సీపీఐ (ఎం) కేంద్ర కమిటీ సభ్యుడుగా ఉన్నాడన్నారు. రెండేండ్ల పాటు రాష్ట్ర కార్యదర్శిగానూ పనిచేశారన్నారు. దోపిడి రహిత సమాజ నిర్మాణం కోసం పోరాటమే సుందరయ్యకి ఇచ్చె ఘనమైన నివాళీ అని అయన అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి కూరపాటి సమ్మయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి.వీరభద్రం, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, సందకూరు లక్ష్మి, నందిపాటి రమేష్, యం.డిజలాల్, వై.వెంకటేశ్వరరావు, నవీన్, వేణు తదితరులు పాల్గొన్నారు.
మహోన్నత వ్యక్తి సుందరయ్య : మచ్చా, ఏజే.రమేష్
భద్రాచలం : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, స్వాతంత్య్ర సమర యోధులు, తెలంగాణ సాయుధ పోరాట రథసారధి అమ రజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నేటి తరానికి ఆదర్శం అని, సుందరయ్య స్ఫూర్తితో ప్రజా బాహుళ్య పార్టీ నిర్మించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, ఏ.జె.రమేష్‌లు పిలుపు నిచ్చారు. పార్టీ భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో సుందరయ్య 37వ వర్ధంతి సభ పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహౌన్నత వ్యక్తి కామ్రేడ్ సుందరయ్య అని, ఆయన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలలో క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పనిచేసేవారని అన్నారు. నిరంతర అధ్యయనశీలి, కార్యోన్మోకుడు కామ్రేడ్ సుందరయ్య అని అన్నారు. కామ్రేడ్ సుందరయ్య కూలి దోపిడీకి వ్యతిరేకంగా తమ కుటుంబం నుండే వ్యవసాయ కార్మిక పోరాటం ప్రారంభించారని వారు అన్నారు. దేశంలో వ్యవసాయ కార్మికుల కోసం 1932లో వ్యవసాయ కార్మిక సంఘాన్ని సుందరయ్య స్థాపించారని అని అన్నారు. బాంచన్ మీ కాళ్లు మొక్కుతా దొరా... అనే వారితో దొర ఏందిరో..వాని పీకుడేందిరో.. అంటూ బందూకులను చేత పట్టించిన విప్లవ ధీరుడు కామ్రేడ్ సుందరయ్య అని అన్నారు. సరళీ కరణ ఆర్థిక విధానాలు వేగం పుంజుకున్న నేటి తరుణంలో కార్పొరేటీకరణ, మతోన్మాదం దాడి పేద ప్రజలపై తీవ్రంగా పడుతోందని బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ దాడి తీవ్రతరం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.బి.నరసారెడ్డి, పార్టీ జిల్లా కమిటీ సభ్యులు గడ్డం స్వామి, ఎం.రేణుక, సున్నం గంగా, పట్టణ కార్యదర్శివర్గ సభ్యులు బండారు శరత్ బాబు, పి.సంతోష్ కుమార్, ఎన్.లీలావతి, పట్టణ కమిటీ సభ్యులు డి.సీతాలక్ష్మి, బి.కుసుమ, యు.జ్యోతి, యన్.నాగరాజు, మాజీ ఎంపీటీసీ చేగొండి శ్రీనివాస్, జి.లక్ష్మీకాంత్, కోరాడ శ్రీనివాస్, భూపేంద్ర, సిహెచ్ మాధవ్, ఏ.రత్నం తదితరులు పాల్గొన్నారు.
చర్ల : ఆదర్శప్రాయుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వతంత్ర సమరయోధుడు, నవయుగ గాంధీగా కీర్తించబడ్డ పుచ్చలపల్లి సుందరయ్య ఉభయ ఆంధ్ర ప్రదేశ్ కమ్యూనిస్టు నాయకుడని సీపీఐ(ఎం) జిల్లా నాయకులు కె.బ్రహ్మచారి అన్నారు. గురువారం సిబిఎస్ రామయ్య భవన్లో పుచ్చలపల్లి సుందరయ్య 37వ వర్ధంతి కార్యక్రమాన్ని పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మండల కమిటీ సభ్యులు, కార్యకర్తలు, ఘనంగా నిర్వహించారు. తొలుత మన కమిటీ సభ్యులు మచ్చ రామారావు అధ్యక్షతన సుందరయ్య చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సుబ్బంపేట సర్పంచ్ సుజాత, 13వ వార్డు సభ్యులు దొడ్డి హరి నాగ వర్మ, మండల కమిటీ సభ్యులు వినోద్, పొడుపు గంటి సమ్మక్క, శ్యామల వెంకటేశ్వర్లు, బందెల చంటి, వరలక్ష్మి, సిరోని, లక్ష్మీ, సునీత, కమల, కుర్నపల్లి మాజీ ఎంపీటీసీ రామారావు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.